నన్ను నమ్మి అవకాశం కల్పించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు ధన్యవాదాలు: మంతెన రామరాజు

  • ఏపీఐఐసీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన రామరాజు
  • పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉండేలా ఏపీఐఐసీని తీర్చిదిద్దుతామని వ్యాఖ్య
  • వైసీపీ పాలనలో ఏపీఐఐసీని నిర్వీర్యం చేశారని విమర్శ
ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) ఛైర్మన్ గా మంతెన రామరాజు ఈ ఉదయం బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... తనను నమ్మి ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, కూటమి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని చెప్పారు. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఏపీఐఐసీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీఐఐసీ ద్వారా కియా, హీరో ఇలా ఎన్నో పరిశ్రమలను చంద్రబాబు తీసుకొచ్చారని... తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని చెప్పారు. 

వైసీపీ పాలనలో ఏపీఐఐసీని నిర్వీర్యం చేశారని రామరాజు విమర్శించారు. తమ కూటమి ప్రభుత్వంలో ఏపీఐఐసీని పారిశ్రామికవేత్తలందరికీ అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఏపీఐఐసీ తరపున ప్రతి నియోజకవర్గంలో లేఔట్ తయారుచేసి ముందుకు వెళ్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలన పూర్తయ్యేలోగానే అనేక పరిశ్రమలను ముందుకు తీసుకెళ్లడం జరిగిందని చెప్పారు. 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందని... దానికి అనుగుణంగా మంత్రులందరూ పని చేస్తున్నారని తెలిపారు.


More Telugu News