బ్రేకప్ చెప్పుకుందామని మెసేజ్ పెట్టాడు.. నేను షాక్ అయ్యాను: జెనీలియా

  • పదేళ్ల ప్రేమ తర్వాత 2012లో రితేశ్ ని పెళ్లి చేసుకున్న జెనీలియా
  • తాము డేటింగ్ లో ఉన్నప్పుడు.. బ్రేకప్ చెప్పుకుందామని మెసేజ్ పెట్టాడన్న జెనీలియా
  • ఎంతో బాధ పడ్డానని వెల్లడి
సినీ నటి జెనీలియా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 'బొమ్మరిల్లు' వంటి ఎన్నో తెలుగు చిత్రాల్లో నటించిన ఆమె... తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. 2002 నుంచి ఆమె బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్ ముఖ్ తో ప్రేమ వ్యవహారంలో ఉంది. 2012లో వీరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. తాము ప్రేమలో ఉన్నప్పుడు రితేశ్ చేసిన ఒక చిలిపి పని గురించి తాజాగా జెనీలియా పంచుకుంది.

ఒకరోజు అర్ధరాత్రి తర్వాత... మనం బ్రేకప్ చెప్పుకుందామని రితేశ్ మెసేజ్ పంపాడని... దాన్ని చూసి తాను షాక్ అయ్యానని జెనీలియా చెప్పింది. ఎంతో బాధతో మరుసటి రోజు రితీశ్ నిద్ర లేవడం కోసం ఎదురు చూశానని... మరుసటి రోజు ఉదయం రితేశ్ ఫోన్ చేసి ఏం చేస్తున్నావని అడిగాడని తెలిపింది. ఇక మనం మాట్లాడుకోకపోవడమే బెటర్ అని తాను చెప్పానని... ఎందుకు అలా మాట్లాడుతున్నావని తనపై రితేశ్ అరిచాడని చెప్పింది. 

మెసేజ్ గురించి తాను చెప్పగా... కేవలం జోక్ గా మెసేజ్ పంపానని, ఆ రోజు ఏప్రిల్ ఫస్ట్ కావడంతో అలా మెసేజ్ పెట్టానని రితేశ్ చెప్పాడని తెలిపింది. ఆ తర్వాత అంతా బాగానే ఉందని చెప్పింది. రితేశ్ ని పెళ్లి చేసుకోవడం తన జీవితంలో తాను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాలలో ఒకటని తెలిపింది.


More Telugu News