భార‌తీయ సినిమాపై చిరంజీవి చెరగని ముద్ర.. గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డు పేజీలో మెగాస్టార్‌పై ప్ర‌త్యేక క‌థ‌నం!

  • ఇటీవ‌ల మెగాస్టార్‌కు గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్సులో చోటు 
  • ఈ నేప‌థ్యంలో త‌న అధికారిక‌ పేజీలో మెగాస్టార్‌పై ప్ర‌త్యేక క‌థ‌నం
  • ఇందులో ఆయ‌న సినీ కెరీర్ హైలైట్స్, దాతృత్వం, సామాజిక సేవ‌ల ప్ర‌స్తావ‌న‌
ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్సులో చోటు దక్కించుకున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో భార‌తీయ సినిమాపై చిరంజీవి చెరగని ముద్ర వేశారంటూ గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డు అధికారిక‌ పేజీలో మెగాస్టార్‌పై ఓ ప్ర‌త్యేక క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. 

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత విజ‌య‌వంతమైన నటుడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్ పొందారు. చిరంజీవి తన అద్భుతమైన సినీ కెరీర్‌లో 143 సినిమాలు, 537 పాటల్లో విభిన్న నృత్యాల‌తో ఆక‌ట్టుకున్నార‌ని ప్ర‌శంసించ‌డం జ‌రిగింది.

'మెగాస్టార్' అని పిలువబడే ఈ నటుడు తనదైన‌ అసాధారణమైన ప్రతిభతో 46 ఏళ్ల‌కు పైగా సినీ కెరీర్‌ను ఆస్వాదిస్తున్నారు. సినిమాల‌పై చిరంజీవి ప్రభావం ఆయనను భారతీయ సినిమాకు ఒక చిహ్నంగా మార్చింద‌ని క‌థ‌నంలో పేర్కొన్నారు. 

కెరీర్ హైలైట్స్ 

1977లో పునాదిరాళ్లు, ప్రాణం ఖరీదు చిత్రాలతో చిరంజీవి సినీ ప్రయాణం మొదలైంది. ఆయ‌న‌ తన ఆన్-స్క్రీన్ చరిష్మా, కామిక్ టైమింగ్, డ్యాన్స్‌పై కమాండ్‌తో ప్రేక్షకులను అల‌రించారు. దాంతో చిరుకు స్టార్‌డమ్ ఏర్ప‌డి, ఏకంగా 'మెగాస్టార్' అనే బిరుదును సంపాదించిపెట్టింది. ఆయ‌న రెండు తెలుగు రాష్ట్రాలకు ఇష్టమైన వ్యక్తి అయ్యారు. కోట్లాది మంది అభిమానుల‌కు అన్న‌య్య అయ్యారు.

చిరంజీవి నటనా నైపుణ్యం మూడు నంది అవార్డులు, ఉత్తమ నటుడిగా ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు తెచ్చిపెట్టింది. అలాగే 1988లో రుద్రవీణ చిత్రానికి గాను నర్గీస్ దత్ అవార్డుతో సహా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులు చిరును వ‌రించాయి. 2007లో భారతదేశపు మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌ అందుకున్నారు. అలాగే 2024లో రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌ ఆయన కీర్తికిరీటంలో చేరింది.

దాతృత్వం, సామాజిక సేవ‌

చిరంజీవి సినిమా రంగానికే ప‌రిమితం కాలేదు. సామాజిక సేవ‌లోనూ ముందున్నారు. 1998లో రక్తం, నేత్రదానంపై దృష్టి సారించి చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ (సీసీటీ)ని స్థాపించారు. ట్రస్ట్ 1 మిలియన్ యూనిట్ల రక్తాన్ని సేకరించి అత్య‌వ‌స‌ర పరిస్థితుల్లో ఎంద‌రినో ఆదుకుంది. అలాగే 10,000 కార్నియల్ ట్రాన్స్‌ప్లాంట్‌లను సులభతరం చేయడంలో కీలకపాత్ర పోషించింది. 

2004 సునామీ, వివిధ తుఫానులతో సహా ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా చిరంజీవి విరాళాలు ఇవ్వ‌డం, సహాయ చర్యలలో ముందున్నారు. కోవిడ్‌-19 మహమ్మారి సమయంలో ఆయ‌న‌ మానవతాదృక్ప‌థం మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది. 2020లో తెలుగు చిత్ర పరిశ్రమలో 15,000 మందికి పైగా రోజువారీ వేతన కార్మికులకు మద్దతుగా, వారికి నెలల తరబడి అవసరమైన నిత్యావ‌స‌ర‌ సామాగ్రిని అందించడానికి ఏకంగా కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ)ని ప్రారంభించారు. 

2021లో క‌రోనా మ‌హమ్మారి విజృంభ‌ణ‌తో విల‌విల్లాడిన బాధితుల‌కు సహాయం చేయడానికి తెలుగు రాష్ట్రాలలో 42 ఆక్సిజన్ బ్యాంకులను కూడా ఏర్పాటు చేశారు. బాలకార్మిక నిర్మూలన, హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన, పోలియో వ్యాక్సినేషన్ కోసం చిరంజీవి చేసిన ప్రచారాలు సమాజ శ్రేయస్సు ప‌ట్ల ఆయ‌న‌కు ఉన్న అంకితభావాన్ని తెలియ‌జేస్తాయి.  

సినిమా, దాతృత్వం, ప్రజాసేవకు చిరంజీవి చేసిన అసమానమైన సహకారాలు భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందికి స్ఫూర్తినిస్తూనే ఉంటాయ‌ని గిన్నీస్ వ‌రల్డ్ రికార్డ్స్ త‌న క‌థ‌నంలో రాసుకొచ్చింది. 


More Telugu News