టీమిండియా 462 ఆలౌట్... న్యూజిలాండ్ టార్గెట్ 107 పరుగులు

  • బెంగళూరులో టీమిండియా × న్యూజిలాండ్
  • ఆసక్తికరంగా తొలి టెస్టు
  • వెలుతురు లేమితో ముగిసిన నాలుగో రోజు ఆట
బెంగళూరు టెస్టులో టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 462 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో, న్యూజిలాండ్ ముందు 107 పరుగుల విజయలక్ష్యం నిలిచింది. సెంచరీ హీరో సర్ఫరాజ్ ఖాన్ (150), కమ్ బ్యాక్ హీరో రిషబ్ పంత్ (99) అవుటైన తర్వాత టీమిండియా ఇన్నింగ్స్ ఎంతో సేపు కొనసాగలేదు. వికెట్లు టపటపా పడిపోయాయి. 

కేఎల్ రాహుల్ (12), రవీంద్ర జడేజా (5) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. అశ్విన్ 15 పరుగులు చేసి ఎనిమిదో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మాట్ హెన్రీ 3, విలియ్ ఓ రూర్కీ 3, అజాజ్ పటేల్ 2, సౌథీ 1, గ్లెన్ ఫిలిప్స్ 1 వికెట్ తీశారు. 

టీమిండియా రెండో ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం, కివీస్ జట్టు లక్ష్యఛేదనకు దిగింది. అయితే, కేవలం నాలుగు బంతులు ఆడిన తర్వాత, సరైన వెలుతురు లేకపోవడంతో అంపైర్లు నాలుగో రోజు ఆటను ముగించారు. అప్పటికి న్యూజిలాండ్  పరుగులేమీ చేయలేదు.

రేపు ఆటకు చివరి రోజు కాగా... టీమిండియా బౌలర్లు ప్రత్యర్థికి చెందిన 10 వికెట్లు పడగొడతారా, లేక కివీస్ జట్టు 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. 

ఇక, ఇవాళ్టి ఆటలో చెప్పుకోవాల్సి వస్తే... సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ ల ఆటే హైలైట్. సర్ఫరాజ్ ఖాన్ 195 బంతుల్లో 18 ఫోర్లు, 3 భారీ సిక్సర్లతో 150 పరుగులు చేశాడు. మరో ఎండ్ లో పంత్ ఒక్క పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. పంత్ 105 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 99 పరుగులు చేసి రూర్కీ బౌలింగ్ లో అవుటయ్యాడు. 

పంత్ రెండో రోజు ఆటలో వికెట్ కీపింగ్ చేస్తుండగా, కుడి మోకాలికి బంతి తగలడంతో మైదానాన్ని వీడడం తెలిసిందే. పంత్ బ్యాటింగ్ కు వస్తాడా, రాడా అనే సందేహాలను పటాపంచలు  చేయడమే కాకుండా, తన ట్రేడ్ మార్క్ దూకుడుతో కివీస్ బౌలర్లను హడలెత్తించాడు. 

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం తెలిసిందే. తొలి రోజు ఆట వర్షార్పణం కాగా... రెండో రోజు నుంచి ఆట సాధ్యమైంది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 46 పరుగులకే కుప్పకూలగా, న్యూజిలాండ్ 402 పరుగులు చేసింది. అయితే, రెండో ఇన్నింగ్స్ లో పుంజుకున్న టీమిండియా... టాపార్డర్ అండతో 462 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.


More Telugu News