వయనాడ్‌లో ప్రియాంకగాంధీపై పోటీచేసే అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ

  • మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవ్య హరిదాస్‌ని రంగంలోకి దింపిన బీజేపీ అధిష్ఠానం
  • కోజికోడ్ కార్పొరేషన్‌లో కౌన్సిలర్‌‌గా నవ్య
  • ఉప ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
వయనాడ్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకగాంధీపై పోటీ చేయబోయే బీజేపీ అభ్యర్థి ఖరారయ్యారు. కేరళ బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న నవ్య హరిదాస్ పేరుని బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. నవ్య ప్రస్తుతం కోజికోడ్ కార్పొరేషన్‌లో కౌన్సిలర్‌గా ఉన్నారని ఆమె సోషల్ మీడియా ప్రొఫైల్‌ని బట్టి అర్థమవుతోంది. పార్టీ డైనమిక్ లీడర్‌లలో ఒకరిగా ఆమె గుర్తింపు పొందారు. వృత్తిరీత్యా మెకానికల్ ఇంజనీర్. 2007లో బీటెక్ పూర్తి చేశారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ వయనాడ్‌తో పాటు అమేథీ నియోజకవర్గం నుంచి కూడా గెలుపొందారు. దీంతో వయనాడ్‌ను ఆయన వదులుకున్నారు. ఈ స్థానంలో పోటీకి ప్రియాంక గాంధీని కాంగ్రెస్ అధిష్ఠానం రంగంలోకి దింపిన విషయం తెలిసిందే.

ఉప ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
వివిధ రాష్ట్రాలలో లోక్‌సభ, అసెంబ్లీ ఉప ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను బీజేపీ అధిష్ఠానం శనివారం రాత్రి విడుదల చేసింది. వయనాడ్‌తో పాటు వివిధ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు మొత్తం 24 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. ఎనిమిది రాష్ట్రాల్లో జరగనున్న ఉప ఎన్నికలకు మొత్తం 24 మంది అభ్యర్థులను పార్టీ ప్రకటించింది.


More Telugu News