పుణే టెస్టులో కివీస్ ఆధిక్యం 301 పరుగులు... టీమిండియా రేపు ఏం చేస్తుందో!

  • ఆసక్తికరంగా పుణే టెస్టు
  • ఓటమి ప్రమాదంలో టీమిండియా
  • రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లకు 198 పరుగులు చేసిన కివీస్
ఇటీవల బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ లో ఘనంగా గెలిచిన టీమిండియా... ఇప్పుడు న్యూజిలాండ్ తో సిరీస్ లో అష్టకష్టాలు పడుతోంది. ఇప్పటికే తొలి టెస్టు ఓడిపోయిన ఆతిథ్య జట్టు, తాజాగా రెండో టెస్టులోనూ ఓటమి ప్రమాదంలో పడింది. 

ఇవాళ ఆటకు రెండో రోజు కాగా... న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లకు 198 పరుగులు చేసింది. తద్వారా తన ఆధిక్యాన్ని 301 పరుగులకు పెంచుకుంది. రేపు మరో 100కి పైగా  పరుగులు చేసి... టీమిండియా ముందు 400కి పైగా లక్ష్యాన్ని నిర్దేశిస్తే... కివీస్ విజయం పెద్ద కష్టమేమీ కాదు. 

అలా కాకూడదంటే... రేపు తొలి సెషన్ లోనే కివీస్ ను టీమిండియా ఆలౌట్ చేయాలి. అప్పుడు కూడా లక్ష్యఛేదన కొంచెం కష్టమైన విషయమే! ఎందుకంటే పుణే పిచ్ తొలి రోజు నుంచే స్పిన్నర్లకు అమోఘంగా సహకరిస్తోంది. రోజులు గడిచే కొద్దీ పిచ్ పై స్పిన్నర్లు మరింత ప్రమాదకరంగా మారతారు. 

ఇక, రెండో రోజు ఆట విషయానికొస్తే... టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 156 పరుగులకే కుప్పకూలింది. కివీస్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ 7 వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించాడు. అంతకుముందు కివీస్ తొలి ఇన్నింగ్స్ లో 259 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. 

ఇక, 103 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన కివీస్... రెండో ఇన్నింగ్స్ ను ఉత్సాహంగా ప్రారంభించింది. కెప్టెన్ టామ్ లాథమ్ 86, విల్ యంగ్ 23, డెవాన్ కాన్వే 17 పరుగులు చేశారు. క్రీజులో టామ్ బ్లండెల్ (30 బ్యాటింగ్), గ్లెన్ ఫిలిప్స్ (9 బ్యాటింగ్) ఉన్నారు. టీమిండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 4, రవిచంద్రన్ అశ్విన్ 1 వికెట్ తీశారు.


More Telugu News