నిషేధాన్ని ధిక్కరించి బాణసంచా కాల్చిన ఢిల్లీ వాసులు.. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ రికార్డు

  • ఢిల్లీ వ్యాప్తంగా దీపావళి పండుగ
  • రాజధానిపై దుప్పటిలా పరుచుకున్న కాలుష్యం
  • ఒక్కసారిగా పెరిగిపోయిన కాలుష్య స్థాయులు
  • పలు ప్రాంతాల్లో 359 దాటేసిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్
దేశ రాజధాని ఢిల్లీ శుక్రవారం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ముద్ర వేసుకుంది. దీపావళి సందర్భంగా గత రాత్రి ఢిల్లీ వ్యాప్తంగా పేలిన బాణసంచాతో ఢిల్లీలో కాలుష్యం భయంకరంగా పెరిగిపోయింది. బాణసంచా కాల్చడంపై నిషేధం ఉన్నప్పటికీ ఎవ్వరూ లెక్క చేయలేదు. ఫలితంగా ఢిల్లీపై కాలుష్యం దుప్పటిలా పరుచుకుంది. దీంతో ఈ ఉదయం ఆరు గంటల సమయానికి ఢిల్లీలో గాలి నాణ్యత ఇండెక్స్ (ఏక్యూఐ) రికార్డు స్థాయిలో 359 దాటేసింది.

ఢిల్లీలోని పలు ప్రాంతాలతోపాటు ఈస్ట్, వెస్ట్ ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ప్రజలు బాణసంచా కాల్చి పండుగ జరుపుకొన్నారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) గణాంకాల ప్రకారం ఈ ఉదయం ఆరు గంటల సమయానికి బురారి క్రాసింగ్‌లో 394, జహంగీర్‌పురిలో 387, ఆర్కే పురంలో 395, రోహిణి (385), అశోక్ విహార్‌లో 384, ద్వారకా సెక్టార్ 8లో 375, ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌లో 375,  మందిర్‌ మార్గ్‌లో 369, పంజాబీ బాఘ్‌లో 391, ఆనంద్ విహార్‌లో 395, సిరి ఫోర్ట్‌లో 373, సోనియా విహార్‌లో 392గా గాలి నాణ్యత నమోదైంది. ఎయిర్ క్వాలిటీలో ఇది అంత్యంత నాసిరకం. రాత్రి ఒంటి గంట తర్వాత గాలిలో నాణ్యత క్రమంగా తగ్గిపోయింది. 

ఢిల్లీ వాసులు నిషేధాన్ని పక్కనపెట్టి బాణసంచా కాల్చడంతో అనేక ప్రాంతాల్లో 2.5గా ఉన్న స్థాయులు ఆ తర్వాత క్యూబిక్ మీటర్‌కు 900 మైక్రోగ్రాములు వరకు పెరిగింది. ఇది ఆమోదయోగ్యమైన పరిమితి కంటే 15 రెట్లు ఎక్కువ.   


More Telugu News