సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన ఆర్.కృష్ణయ్య

  • విద్యార్థుల హాస్టల్ మెస్ ఛార్జీలు పెంచడంపై కృష్ణయ్య హర్షం
  • మెస్ ఛార్జలు రూ.2,100కు పెంచడం ఆహ్వానించదగ్గ విషయమన్న కృష్ణయ్య
  • బీసీలకు రిజర్వేషన్లు పెంచాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్
హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు. హాస్టల్ మెస్ ఛార్జీలను రూ.3 వేలు పెంచాలని తాము డిమాండ్ చేసినప్పటికీ... రూ.2 వేలు చేస్తారని భావించామని, కానీ రూ.1,500 నుంచి రూ.2,100కు ప్రభుత్వం పెంచడం ఆహ్వానించదగ్గ పరిణామం అన్నారు.

హాస్టల్ విద్యార్థుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఈ నిర్ణయంతో అర్థమవుతోందన్నారు. అలాగే హాస్టల్ స్టాఫ్‌ను పెంచడంతో పాటు మౌలిక వసతులు కల్పించడంపై దృష్టి సారించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికలపై కృష్ణయ్య

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. పెంచబోయే రిజర్వేషన్లకు న్యాయపరమైన చిక్కులు రాకుండా రాజ్యాంగపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పార్లమెంట్‌లో ప్రైవేటు బిల్లు పెట్టైనా సరే బీసీలకు రిజర్వేషన్లు పెంచాలన్నారు. బీసీలు పోరాడితేనే రాజ్యాంగబద్ధమైన హక్కులు వస్తాయన్నారు.


More Telugu News