మాలేగావ్ బాంబు పేలుడు కేసు.. బీజేపీ నాయకురాలు ప్రగ్యా ఠాకూర్‌కు బెయిలబుల్ వారెంట్

  • 2008లో మాలెగావ్‌లో బాంబు పేలుడు
  • ఆరుగురి మృతి.. 100 మందికిపైగా గాయాలు
  • ప్రధాన నిందితురాలిగా మాజీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్
  • అనారోగ్య కారణాలతో కోర్టు విచారణకు గైర్హాజరు
2008లో మాలేగావ్‌లో జరిగిన బాంబు పేలుడు కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న బీజేపీ నేత, వివాదాస్పద సాధ్వి ప్రగ్యా ఠాకూర్‌కు ఎన్ఐఏ కోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జూన్ 4 నుంచి ఆమె విచారణకు హాజరు కాకపోవడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కోర్టు ఆదేశాల ప్రకారం ప్రగ్యా ఈ నెల 13లోపు కోర్టులో హాజరు కావాల్సి ఉంటుంది. లేదంటే రూ. 10 వేలు చెల్లించి తనకు వ్యతిరేకంగా జారీ అయిన వారెంట్‌ను రద్దు చేసుకోవచ్చు. 

ప్రగ్యా ఠాకూర్ చికిత్స తీసుకుంటున్నారని, కాబట్టి ఈ కేసులో రోజువారీ విచారణకు ఆమె హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలంటూ ఆమె తరపు లాయర్లు పెట్టుకున్న పిటిషన్‌ను ప్రత్యేక న్యాయమూర్తి ఏకే లహోటీ పరిగణనలోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసులో తుది విచారణ జరుగుతున్న నేపథ్యంలో నిందితురాలు కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని, కాబట్టి బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని జడ్జ్ ఆదేశించారు. కాగా, ప్రగ్యాపై వారెంట్లు జారీ కావడం ఇదే తొలిసారి కాదు. కాగా, 29 సెప్టెంబర్ 2008లో మహారాష్ట్రలోని మాలెగావ్‌లో ఓ మసీదు సమీపంలో జరిగిన బాంబు పేలుడులో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా 100 మందికిపైగా గాయపడ్డారు. 


More Telugu News