అమెరికాలో నాలాంటి వాళ్లకు భవిష్యత్తు లేదు.. ట్రంప్ విజయంపై మస్క్ ట్రాన్స్ జెండర్ కూతురు వ్యాఖ్య

  • దేశం విడిచి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడి
  • ట్రంప్ అధికారంలో ఉండేది నాలుగేళ్లేనని తెలుసన్న వివియాన్
  • కానీ ఆయనకు ఓటేసిన జనం దేశంలోనే ఉంటారని వివరణ
అమెరికాలో నాలాంటి వాళ్లకు భవిష్యత్తు లేదు.. ట్రంప్ విజయంపై మస్క్ ట్రాన్స్ జెండర్ కూతురు వ్యాఖ్య
డొనాల్డ్ ట్రంప్ విజయంతో అమెరికాలో ఇక తనలాంటి ట్రాన్స్ జెండర్లకు భవిష్యత్తు లేదని తేలిపోయిందంటూ ఎలాన్ మస్క్ కూతురు వివియాన్ విల్సన్ చెప్పారు. ఇటీవలి కాలంలో దేశం విడిచి వెళ్లాలనే ఆలోచన తరచూ తన మదిలోకి వచ్చేదన్నారు. ట్రంప్ గెలిచాడనే వార్త విన్నాక తన ఆలోచనకు మరింత స్పష్టత వచ్చిందని వివరించారు. ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ కేవలం నాలుగేళ్లు మాత్రమే ప్రభుత్వంలో ఉంటారనే విషయం తనకూ తెలుసన్నారు.

ఈ నాలుగేళ్ల కాలంలో ఏదైనా మ్యాజిక్ జరిగి ట్రాన్స్ జెండర్ లకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలను ట్రంప్ తీసుకోబోడని అనుకుందాం.. అయినప్పటికీ, ట్రంప్ కావాలని, ఆయనే రావాలని ఓటేసిన జనం మాత్రం ఎక్కడికీ వెళ్లరని చెప్పారు. సమీప భవిష్యత్తులో ట్రాన్స్ జెండర్లపై వారి మనస్తత్వంలో మార్పు వచ్చే అవకాశంలేదని తేలిపోయిందన్నారు. దీనివల్ల ట్రాన్స్ జెండర్లకు అమెరికాలో భవిష్యత్తు లేదనే స్పష్టత వచ్చిందని వివియాన్ తెలిపారు.

ఎలాన్ మస్క్ మొదటి భార్య ద్వారా కలిగిన ఆరుగురు సంతానంలో వివియాన్ విల్సన్ ఒకరు. అబ్బాయిగా పుట్టినప్పటికీ అమ్మాయిగా మారేందుకు ప్రయత్నించిన వివియాన్ ను మస్క్ అడ్డుకున్నారు. ఎంతగా నచ్చజెప్పినా వినకుండా 2022లో వివియాన్ అధికారికంగా తన పేరు, లింగం మార్చుకోవడంతో మస్క్ మండిపడ్డారు. తన బిడ్డ (వివియాన్) ఓ వైరస్ తో చనిపోయాడంటూ ప్రకటించారు. 2022 నుంచే వివియాన్ తన తండ్రి మస్క్ కు దూరంగా జీవిస్తోంది.


More Telugu News