అసెంబ్లీలో ఆర్ధిక కమిటీల ఎన్నిక .. మూడు కమిటీలకు ఎన్నికైంది వీరే!

  • ఏపీ అసెంబ్లీ ఫైనాన్షియల్ కమిటీ సభ్యుల ఎన్నిక
  • ఎన్నికను బహిష్కరించిన వైసీపీ
  • ఎన్నికైన సభ్యుల పేర్లను శాసనసభలో ప్రకటించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఫైనాన్షియల్ కమిటీల్లో భాగంగా శాసనసభ ప్రజాపద్ధుల కమిటీ (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ), శాసనసభ అంచనాల కమిటీ (ఎస్టిమేట్స్ కమిటీ) మరియు ప్రభుత్వ సంస్థల కమిటీ (పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ) లకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను శాసన సభ నుండి సభ్యులను ఎన్నుకున్నారు. రాష్ట్ర శాసనసభ కమిటీ హాల్‌లో శుక్రవారం జరిగిన ఎన్నికల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ సహా కూటమి ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వైసీపీ ఓటింగ్‌ను బహిష్కరించింది. 
 
అసెంబ్లీ సంప్రదాయకంగా ప్రతిపక్ష పార్టీకి పీఏసీ చైర్మన్ పదవి అప్పగిస్తారన్న భావనతో వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తొలుత నామినేషన్ దాఖలు చేశారు. అయితే శాసనసభలో వైసీపీ ప్రతిపక్ష హోదా లేకపోవడంతో సభ్యుల గెలుపుకు అవసరమైన బలం లేకపోవడంతో కూటమి ఎమ్మెల్యేలు పోటీకి బరిలో దిగారు.

కమిటీల్లో సభ్యుడుగా ఎన్నిక అవ్వాలంటే 20 ఓట్లు రావాలి. కానీ వైసీపీకి శాసనసభలో 11 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో నామినేషన్ దాఖలు చేసినప్పటికీ ఓటింగ్‌కు వైసీపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. కాగా, ఓట్ల లెక్కింపు కార్యక్రమం పూర్తయిన తర్వాత కమిటీల వారీగా ఎన్నికైన సభ్యుల పేర్లను శాసనసభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. 
 
ప్రజా పద్దుల కమిటీ సభ్యులుగా ఆనంద బాబు నక్కా, ఆరిమిల్లి రాధాకృష్ణ, అశోక్ రెడ్డి ముతుముల, బూర్ల రామాంజనేయులు, బి. జయనాగేశ్వర్ రెడ్డి, కొల్లా లలిత కుమారి, శ్రీ రాజగోపాల్ శ్రీరామ్, శ్రీ రామాంజనేయులు పులపర్తి, విష్ణుకుమార్ రాజు పెన్మెత్స ఎంపికైనట్లు ప్రకటించారు. 

అంచనాల కమిటీ సభ్యులుగా అఖిల్ ప్రియ భూమా, బండారు సత్యానంద రావు, జయకృష్ణ నిమ్మక, జోగేశ్వరరావు వేగుళ్ల, కందుల నారాయణరెడ్డి, మద్దిపాటి వెంకటరాజు, పార్థసారథి వాల్మీకి, పసిం సునీల్ కుమార్, ఏలూరి సాంబశివరావు ఎంపికైనట్లు ప్రకటించారు.

ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ సభ్యులుగా  అయితా బత్తుల ఆనందరావు,  ఈశ్వర్ రావు నడికుడిటి, గిడ్డి సత్యనారాయణ, గౌతు శిరీష, కూన రవికుమార్, కుమార్ రాజా వర్ల, ఆర్ వి ఎస్ కే కే రంగారావు (బేబీ నాయన), తెనాలి శ్రావణ్ కుమార్, వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఎంపికైనట్లు ప్రకటించారు.


More Telugu News