పెర్త్ టెస్టు.. భారీ విజ‌యం దిశ‌గా భార‌త్

  • పెర్త్ వేదిక‌గా భార‌త్‌, ఆసీస్ తొలి టెస్టు
  • ఆస్ట్రేలియా ముందు 534 ప‌రుగుల భారీ లక్ష్యం
  • 79 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయి ఎదురీత‌
  • అర్ధ శ‌త‌కంతో ట్రావిస్ హెడ్ ఒంటరి పోరు
బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదిక‌గా జ‌రుగుతున్న తొలి టెస్టులో భార‌త జ‌ట్టు భారీ విజ‌యం దిశ‌గా సాగుతోంది. 534 ప‌రుగుల భారీ లక్ష్య‌ఛేద‌న‌తో బ‌రిలోకి దిగిన ఆతిథ్య ఆస్ట్రేలియా 79 ప‌రుగుల‌కే స‌గం వికెట్లు పారేసుకుంది. దీంతో భార‌త్ గెలుపు లాంఛ‌న‌మే. 

ఓవ‌ర్‌నైట్ స్కోర్ 12 పరుగులతో నాలుగో రోజు ఆట కొన‌సాగించిన ఆసీస్ మ‌రో ఐదు ప‌రుగులు జోడించి ఉస్మాన్ ఖ‌వాజా వికెట్‌ను కోల్పోయింది. ఆ త‌ర్వాత స్టీవ్ స్మిత్‌తో జ‌త క‌ట్టిన‌ ట్రావిస్ హెడ్.. కొద్దిసేపు భారత బౌల‌ర్ల‌ను నిలువరించాడు. 

అయితే, సిరాజ్ విసిరిన ఓ అద్భుత‌మైన బంతికి స్మిత్ బోల్తా ప‌డ్డాడు. కీప‌ర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. దీంతో ఈ ద్వ‌యం 62 ప‌రుగుల భాగ‌స్వామ్యానికి తెర‌ప‌డింది. ఈ క్రమంలో హెడ్ అర్ధ శ‌త‌కం న‌మోదు చేశాడు. 

భార‌త బౌల‌ర్ల‌లో సిరాజ్ 3 వికెట్లు, బుమ్రా 2 వికెట్లు తీశారు. ప్ర‌స్తుతం క్రీజులో ట్రావిస్ హెడ్ (63), మిచెల్ మార్ష్ (4) ఉండ‌గా.. ఆసీస్ స్కోర్ 104/5 (30 ఓవ‌ర్లు). ఆస్ట్రేలియా విజ‌యానికి ఇంకా 430 ర‌న్స్ కావాలి. భార‌త్ గెల‌వాలంటే ఐదు వికెట్లు ప‌డ‌గొట్టాలి.  




More Telugu News