అజ్ఞాతంలో వర్మ.. తెలంగాణ, తమిళనాడులో పోలీసుల గాలింపు

  • చంద్రబాబు, పవన్, లోకేశ్ ల మార్ఫింగ్ ఫొటోల కేసు
  • పోలీసు విచారణకు డుమ్మా కొడుతున్న వర్మ
  • నిన్నటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన ఆర్జీవీ
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎన్నికలకు ముందు... 'వ్యూహం' సినిమా ప్రమోషన్ల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ల మార్ఫింగ్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, కించపరిచే కామెంట్లు చేసిన వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

విచారణకు హాజరుకావాలంటూ ఆయనకు ఇప్పటి వరకు రెండు సార్లు నోటీసులు ఇచ్చారు. అయితే, పోలీసు విచారణకు ఆయన డుమ్మా కొట్టారు. నిన్న ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరుకాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.  

మరోవైపు, వర్మ విచారణకు హాజరుకాకపోవచ్చనే అనుమానంతో... హైదరాబాద్ లోని వర్మ నివాసం వద్దకు నిన్న ఒంగోలు పోలీసులు వెళ్లారు. వర్మను అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్లారనే వార్తలు వచ్చాయి. అయితే, వర్మ ఇంట్లో లేరని ఆయన సిబ్బంది పోలీసులకు తెలిపారు. దీంతో, ఆయన కోసం పోలీసులు వెతుకుతున్నారు. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో గాలిస్తున్నారు. 

ఇంకోవైపు, వర్చువల్ గా పోలీసు విచారణకు హాజరవుతారని పోలీసులను వర్మ తరపు లాయర్లు కోరుతున్నారు. అయితే వర్చువల్ విచారణకు పోలీసులు అంగీకరించలేదు. మరోవైపు, ఈరోజు ఏపీ హైకోర్టులో వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది.


More Telugu News