అదానీ కేసులో నా పేరు ఎక్కడా లేదు.. వారిపై పరువునష్టం దావా వేస్తా: జగన్

  • విద్యుత్ ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వం, సెకీ మధ్య జరిగాయన్న జగన్
  • తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపాటు
  • లక్ష కోట్లు ఆదా చేయడం సంపద సృష్టి కాదా? అని ప్రశ్న
దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న అదానీ కేసుపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. అదానీపై నమోదైన కేసులో తన పేరు ఎక్కడా లేదని ఆయన అన్నారు. పారిశ్రామికవేత్తలు ముఖ్యమంత్రులను కలుస్తుంటారని... వారిని రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తుంటాయని చెప్పారు. ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో తనను అనేక మార్లు అదానీ కలిశారని తెలిపారు. 

తనను అదానీ కలవడంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. విద్యుత్ ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వం, సెకీ మధ్యే జరిగాయని... ఇందులో మూడో వ్యక్తి ప్రమేయం లేదని చెప్పారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వ్యక్తులపై పరువునష్టం దావా వేస్తానని తెలిపారు. 

రాష్ట్ర చరిత్రలో అత్యంత చవకైన విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఇదేనని జగన్ చెప్పారు. యూనిట్ విద్యుత్ ధర రూ. 5.10 నుంచి రూ. 2.49కి తగ్గిందని... ఈ ఒప్పందం వల్ల దాదాపు లక్ష కోట్లు ఆదా చేయడం సంపద సృష్టి కాదా? అని ప్రశ్నించారు. ఇంత మంచి ఆఫర్ రాష్ట్రానికి వచ్చినప్పుడు... ఆ ఆఫర్ ను పక్కన పెడితే మీరంతా తనను ఏమనేవారు? అని అడిగారు. 

ఇంత చవకైన విద్యుత్ కొనుగోలు ఎన్నడూ జరగలేదని జగన్ చెప్పారు. అన్నీ తెలిసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అవాస్తవాలు మాట్లాడుతున్నారని... ఇది ధర్మమేనా? అని ప్రశ్నించారు. తాము లక్ష కోట్లు ఆదా చేసేందుకు ప్రయత్నిస్తే... చంద్రబాబు రూ. 80 వేల కోట్లు ఆవిరి చేసే ఒప్పందాలు చేసుకున్నారని దుయ్యబట్టారు.


More Telugu News