కాలికి బ్యాండేజీతో కోహ్లీ... రెండో టెస్టుకు ముందు టీమిండియా శిబిరంలో ఆందోళన

  • ఈ నెల 6 నుంచి అడిలైడ్ ఓవ‌ల్‌ వేదిక‌గా రెండో టెస్టు
  • ప్రాక్టీస్ సంద‌ర్భంగా కాలికి బ్యాండేజీతో క‌నిపించిన విరాట్‌
  • ఈ మ్యాచ్‌కు కోహ్లీ దూర‌మైతే భార‌త్‌కు భారీ దెబ్బ‌
  • అడిలైడ్‌లో అద్భుత‌మైన రికార్డు క‌లిగి ఉన్న స్టార్ ప్లేయ‌ర్‌
బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్టులో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఐదు మ్యాచుల బీజీటీ సిరీస్‌లో రెండో టెస్టు ఈ నెల 6 నుంచి అడిలైడ్ ఓవ‌ల్‌ వేదిక‌గా ప్రారంభం కానుంది. దీనికోసం ఇప్ప‌టికే టీమిండియా అడిలైడ్‌కు చేరుకుంది. భార‌త ఆట‌గాళ్లు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు.   

అయితే, ఈ ప్రాక్టీస్ సంద‌ర్భంగా భార‌త స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ కాలికి బ్యాండేజీతో క‌నిపించ‌డం ఇప్పుడు అంద‌రినీ క‌ల‌వ‌ర పెడుతోంది. ఇలా కాలికి బ్యాండేజీతో ఉన్న‌ కోహ్లీ ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. దీంతో అభిమానులు విరాట్ రెండో టెస్టులో బ‌రిలోకి దిగుతాడా? లేదా? అంటూ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. 

ఇక ప్రాక్టీస్ సెష‌న్‌లో కోహ్లీ కుడి కాలు మోకాలి నొప్పితో ఇబ్బంది ప‌డ‌గా, మెడిక‌ల్ టీమ్ వ‌చ్చి చికిత్స చేసి అనంత‌రం మోకాలికి బ్యాండేజీ వేసిన‌ట్లు తెలుస్తోంది. ఒక‌వేళ రెండో టెస్టుకు ర‌న్‌మెషిన్ దూర‌మైతే మాత్రం అది భార‌త జ‌ట్టుకు పెద్ద దెబ్బ‌నే చెప్పాలి. ఎందుకంటే అడిలైడ్ మైదానంలో కోహ్లీ అద్భుత‌మైన రికార్డును క‌లిగి ఉన్నాడు.

ఇక్క‌డ ఆడిన నాలుగు టెస్టు మ్యాచుల్లోని 8 ఇన్నింగ్స్‌ల‌లో 63.62 స‌గ‌టుతో ఏకంగా 509 ర‌న్స్ చేశాడు. ఇక 2014లో జ‌రిగిన టెస్టులోనైతే రెండు ఇన్నింగ్స్‌ల‌లో వ‌రుస‌గా శ‌త‌కాలు న‌మోదు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 115 ప‌రుగులు చేయ‌గా, రెండో ఇన్నింగ్స్‌లో 141 ర‌న్స్ చేశాడు. 


More Telugu News