టెస్ట్ క్రికెట్ చరిత్రలో సుదీర్ఘ ఇన్నింగ్స్‌ ఆడిన టాప్-5 ప్లేయర్స్ వీళ్లే

  • ఏకంగా 16 గంటల పాటు క్రీజులో నిలిచిన పాకిస్థాన్ దిగ్గజం హనీఫ్ మహ్మద్
  • 878 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసి రెండవ స్థానంలో నిలిచిన గ్యారీ కిర్‌స్టెన్
  • పాకిస్థాన్‌పై 836 నిమిషాల పాటు బ్యాటింగ్ ఇంగ్లండ్ దిగ్గజం అలిస్టర్ కుక్
కొత్తగా వచ్చిన టీ20, వన్డే ఫార్మాట్లతో పోల్చితే టెస్ట్ ఫార్మాట్ క్రికెట్ చాలా ప్రత్యేకమైనది. 5 రోజులపాటు కొనసాగే ఈ ఫార్మాట్ బ్యాటర్లు, బౌలర్లకు అగ్నిపరీక్ష లాంటిది. ముఖ్యంగా బ్యాటర్లు చాలా ఓపికతో ఆడి పరుగులు రాబట్టాల్సి ఉంటుంది. టెస్ట్ ఫార్మాట్ క్రికెట్ మొదలై దాదాపు 147 ఏళ్లు అవుతోంది. అయితే పలువురు ఆటగాళ్లు ఆడిన కొన్ని సుదీర్ఘ ఇన్నింగ్స్‌ లు చిరస్మరణీయంగా నిలిచిపోయాయి. వారిలో టాప్-5 ఆటగాళ్లు ఎవరు, ఎంతసేపు ఆడారో తెలుసుకుందాం.

హనీఫ్ మహ్మద్..  16 గంటలపాటు బ్యాటింగ్

పాకిస్థాన్ దిగ్గజం హనీఫ్ మహ్మద్ టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడారు. 1958లో బ్రిడ్జ్‌టౌన్‌లో వెస్టిండీస్‌పై ఏకంగా 970 నిమిషాల పాటు బ్యాటింగ్ చేశాడు. అంటే దాదాపు 16.16 గంటల పాటు క్రీజులో నిలబడ్డాడు. 337 పరుగులు సాధించాడు. 

దక్షిణాఫ్రికా దిగ్గజం గ్యారీ కిర్‌స్టన్ 1999లో ఇంగ్లండ్‌పై జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 878 నిమిషాల పాటు బ్యాటింగ్ చేశాడు. 14 గంటలకు పైగా క్రీజులో నిలిచి 642 బంతులు ఎదుర్కొని 275 పరుగులు సాధించాడు. డర్బన్‌లోని కింగ్స్‌మీడ్‌ మైదానంలో ఈ మ్యాచ్ జరిగింది.

ఈ జాబితాలో ఇంగ్లండ్ బ్యాటింగ్ గ్రేట్ అలిస్టర్ కుక్ మూడవ స్థానంలో నిలిచాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 836 నిమిషాల పాటు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తం 528 బంతులు ఎదుర్కొని 263 పరుగులు సాధించాడు. 

శ్రీలంక బ్యాటర్ సనత్ జయసూర్య  నాలుగవ స్థానంలో నిలిచాడు. 1997లో భారత్‌తో జరిగిన పోరులో జయసూర్య 799 నిమిషాలు క్రీజులో గడిపాడు. 578 బంతులు ఎదుర్కొని 340 పరుగులు బాదాడు. ఇందులో 36 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఇదే మ్యాచ్‌లో శ్రీలంక ఒకే ఇన్నింగ్స్‌లో 952 పరుగులు సాధించి చరిత్ర సృష్టించింది. 

ఇక, ఇంగ్లండ్‌కు చెందిన లెన్ హట్టన్ 5వ స్థానంలో నిలిచాడు. 1938లో ఓవల్‌ వేదికగా జరిగిన ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ల 797 నిమిషాల పాటు క్రీజులో నిలిచాడు. మొత్తం 847 బంతులు ఎదుర్కొని 364 పరుగులు సాధించాడు.


More Telugu News