ఒక యోగిలా ఉన్నారు... ఆయనను చూస్తుంటే చేతులెత్తి నమస్కరించాలనిపిస్తోంది: మంత్రి పయ్యావుల

  • విజయవాడలో స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమం
  • హాజరైన పయ్యావుల కేశవ్
  • ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రశంసల వర్షం
విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో ఇవాళ స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్, విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విజన్-2047 డాక్యుమెంట్ ను ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల ప్రసంగిస్తూ... ఈ రోజు ఎంతో చారిత్రాత్మక దినం అని వెల్లడించారు. రాష్ట్ర భవిష్యత్ ను నిర్దేశించే విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించుకున్నామని, ఇందులో మనందరం భాగస్వాములం కావడం అదృష్టంగా భావించాలని తెలిపారు. 

"ఇవాళ చంద్రబాబు ఆవిష్కరించిన డాక్యుమెంట్ ఏదైతే ఉందో, అది కన్సల్టెంట్లు తయారు చేసిన పుస్తకం కాదు. దీనివెనుక చంద్రబాబు రాత్రింబవళ్లు పడిన శ్రమ ఉంది. సచివాలయంలో గంటల తరబడి ఉంటూ, భోజనం కూడా చేయకుండా, శాఖలవారీగా... ప్రజలకు ఏం కావాలన్నదానిపై ఆయన తన ఆలోచనలను విజన్ డాక్యుమెంట్ రూపంలో తీసుకువచ్చారు. చంద్రబాబు ఆలోచనలకు ప్రతిరూపమే ఈ విజన్ డాక్యుమెంట్-2047. 

దేశంలో విజన్ డాక్యుమెంట్లకు మూల పురుషుడు ఎవరంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబే. 1994లో ముఖ్యమంత్రి కాగానే విజన్-2020 డాక్యుమెంట్ తయారు చేస్తే, అప్పటి ప్రతిపక్ష నేతలు ఎంతో అపహాస్యం చేశారు. ఆనాడు ఐటీ విప్లవం అందిపుచ్చుకోవడానికి ఇంటర్నెట్ కావాలి అంటే... ఇంటర్నెట్ కాదు పంపు సెట్ కావాలన్నారు. ఇవాళ ఆ పంపు సెట్ నే ఇంటర్నెట్ ద్వారా నడిపే దశకు మనం చేరుకున్నామంటే అందుకు కారణం చంద్రబాబు. 

ఈ విజన్ డాక్యుమెంట్ అంటే  ఏ కంప్యూటరో కాదు...  కాడి పట్టిన రైతన్నకు ఏం కావాలి? పొలంలో పనిచేసే కూలీకి ఏం కావాలి? వారి పిల్లలకు ఏం కావాలి, వారు భవిష్యత్తులో ఉన్నత స్థానానికి ఎలా ఎదగాలి అనేది ఆలోచన చేసేదే ఈ విజన్ డాక్యుమెంట్-2047. ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకోవాలని నాడు విజన్-2020లో పేర్కొంటే చాలామంది నవ్వారు. కానీ ఇవాళ దాని ఫలితాలు చూస్తున్నాం.  

ఆనాడు కేవలం 10 ఇంజినీరింగ్ కాలేజీలు ఉంటే, విజన్-2020 అనంతరం వాటి సంఖ్య 250కి పెరిగింది. అందులో చదువుకున్న పిల్లలు ఐటీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఉపాధి పొందుతున్నారంటే అదీ విజన్ డాక్యుమెంట్. అమెరికాలో అత్యంత అధికంగా సంపాదించేవాళ్లు ఎవరంటే... మన తెలుగు పిల్లలే... అందుకు కారణం చంద్రబాబు విజన్-2020. 

ఆ విజన్ కు ప్రబల తార్కాణం హైదరాబాద్ రూపంలో మన కళ్ల ముందే ఉంది. దాని మీద కూడా అనేక భాష్యాలు చెప్పారు. నిజాం కట్టిన హైదరాబాద్ ను చూశాం... బ్రిటీష్ వాళ్లు ఏర్పరచిన సికింద్రాబాద్ ను చూశాం.... మన కళ్ల ముందు చంద్రబాబు తీసుకువచ్చిన సైబరాబాద్ ను ఇవాళ చూస్తున్నాం.... ఆ సైబరాబాద్ ఇచ్చిన లక్షల ఉద్యోగాలను కూడా చూస్తున్నాం... ఆ లక్షల ఉద్యోగాలతో బాగుపడిన మన కుటుంబాలను కూడా చూస్తున్నాం... అదీ విజన్ అంటే... అదీ నాయకత్వం అంటే! 

పరిపాలన అంటే ప్రజావేదికలను కుప్పకూల్చడం కాదు... పారిశ్రామికవేత్తలను తరిమేయడం కాదు... జల వనరుల ప్రాజెక్టులను నిలిపేయడం కాదు, రహదారులను గుంతలమయంగా చేయడం కాదు,  పేదలను పట్టించుకోకపోవడం కాదు... అన్ని వర్గాలను అభివృద్ధి దిశగా నడిపించడమే నాయకత్వం. 

హైదరాబాద్ ఇవాళ ఒక విశ్వనగరంగా ఎదిగింది. ఆ నగర భవిష్యత్ ను తీర్చిదిద్దిన చంద్రబాబు మాత్రం ఒక యోగి లాగా నిర్లిప్తంగా తన పని తాను చేసుకుపోతున్నారు. ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలని కలలు కంటున్నారు. లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్న ఆ నాయకుడిని చూస్తుంటే చేతులెత్తి నమస్కారం చేయాలనిపిస్తుంది. మనందరం ఏడింటికి లేచి, పనులు చూసుకుని మళ్లీ  రాత్రి తొమ్మిదింటికో, పదింటికో టీవీ చూసి పడుకుంటే... ఒక్క మనిషి మాత్రం ఈ రాష్ట్రం కోసం పనిచేస్తూనే ఉంటాడు. ఎన్నోసార్లు ఆయన సెక్రటేరియట్ లోనే రాత్రి భోజనం చేశారు. ఎవరి కోసం ఇదంతా! ఈ జీవితం అనేది ప్రజలకే అంకితం అని చంద్రబాబు నిశ్చయించుకున్నారు" అంటూ  పయ్యావుల వివరించారు.


More Telugu News