పొట్టలోని కొవ్వును తగ్గించగల పళ్లు ఇవే!

  • మారిన జీవన శైలితో చాలా మందిలో ఊబకాయం సమస్య
  • ముఖ్యంగా పొట్ట, నడుము చుట్టూ పేరుకుపోతున్న కొవ్వుతో ఇబ్బందులు
  • కొన్ని రకాల పళ్లలోని పోషకాలు, రసాయన సమ్మేళనాలతో ఆ కొవ్వు కరుగుతుందంటున్న ఆరోగ్య నిపుణులు
  • డైటింగ్‌, వ్యాయామంతోపాటు వీటిని అదనంగా చేర్చుకుంటేనే ప్రయోజనమని స్పష్టీకరణ
మారిన జీవన శైలితో చాలా మంది బరువు పెరిగిపోతున్నారు. ముఖ్యంగా పొట్టచుట్టూ, నడుము వద్ద కొవ్వు పేరుకుపోతోంది. ఊబకాయం ముసురుకుంటోంది. అలాంటివారు బరువు తగ్గేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. మొత్తంగా బరువు తగ్గినా... పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు (బెల్లీ ఫ్యాట్‌) తగ్గడం మాత్రం కష్టమే. అయితే కొన్ని రకాల పళ్లను రోజూ మన ఆహారంలో చేర్చుకుంటే... బెల్లీ ఫ్యాట్‌ ను కరిగించడానికి తోడ్పడుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా బరువు తగ్గడానికి కూడా వీలవుతుందని సూచిస్తున్నారు. అయితే డైటింగ్‌, వ్యాయామంతోపాటు అదనంగా ఈ పళ్లను తీసుకుంటేనే ప్రయోజనమని... వాటిని మానేస్తే లాభం ఉండదని స్పష్టం చేస్తున్నారు.

బెర్రీ జాతికి చెందిన పళ్లు... దానిమ్మ
స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ప్‌ బెర్రీలు వంటి బెర్రీ జాతికి చెందిన పళ్లలో, దానిమ్మ పళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్‌ ఎక్కువ. ఇవి జీర్ణవ్యవస్థను సరిదిద్దుతాయి. కొవ్వు తగ్గే ప్రక్రియను వేగవంతం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు వాటి గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ కూడా తక్కువని వివరిస్తున్నారు. ఇక దానిమ్మలోని పాలీఫెనాల్స్ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయులను నియంత్రిస్తాయని చెబుతున్నారు.

యాపిల్స్‌
యాపిల్స్‌ లో ఫైబర్‌ ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉంటాయని.. దీనితో కడుపు నిండుగా ఉన్నట్టు అనిపిస్తుందని, శరీరానికి శక్తి తక్కువగా అందుతుందని నిపుణులు చెబుతున్నారు. యాపిల్స్‌ లో ఉండే పెక్టిన్‌ అనే ప్రత్యేకమైన ఫైబర్‌ ఆహారం జీర్ణమయ్యే వేగాన్ని తగ్గించి, ఆకలిని నివారిస్తుందని వివరిస్తున్నారు.

అవకాడోలు...
వీటిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్‌, ఇతర రసాయన సమ్మేళనాలు శరీరంలో ఇన్‌ ఫ్లమేషన్‌ను తగ్గించి, కొవ్వులను కరిగించే హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

నారింజ పళ్లు...
వీటిలో కేలరీలు తక్కువ, విటమిన్‌ సీ చాలా ఎక్కువని... శరీరంలో జీవక్రియలను వేగవంతం చేసి కొవ్వు తగ్గేందుకు తోడ్పడుతాయని నిపుణులు చెబుతున్నారు. నారింజ పళ్లలో అధికంగా ఉండే ఫైబర్‌... కడుపు నిండుగా ఉన్న భావన కలిగించి, ఆకలిని తగ్గిస్తుందని వివరిస్తున్నారు.

  • బొప్పాయిలోని పాపైన్ అనే ఎంజైమ్‌ మన జీర్ణ వ్యవస్థను సరిదిద్ది, పొట్టచుట్టూ ఉన్న కొవ్వును తగ్గించేందుకు దోహదపడుతుందని వివరిస్తున్నారు.
  • దబ్బపండు (గ్రేప్‌ ఫ్రూట్‌)లో ఉండే ఎంజైమ్‌ లు శరీరంలో షుగర్‌ స్థాయులు, ఇన్సులిన్ విడుదలను నియంత్రిస్తాయని.. కొవ్వు కరిగేందుకు తోడ్పడుతాయని నిపుణులు చెబుతున్నారు.
  • పుచ్చకాయ (వాటర్‌ మెలన్‌)లో ఉండే అర్జినైన్‌ అనే అమైనో యాసిడ్‌ శరీరంలో కొవ్వును కరిగించే ప్రక్రియను వేగవంతం చేస్తుందని వివరిస్తున్నారు.
  • పైనాపిల్‌ లో ఉండే బ్రమెలీన్‌ ఎంజైమ్‌ మన జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపర్చి, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుందని... కొవ్వు తగ్గేందుకు తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.


More Telugu News