సచిన్‌తో స్నేహ బంధంపై ఎట్టకేలకు మౌనం వీడిన వినోద్ కాంబ్లీ

  • సచిన్ సాయం చేయలేదని నిరాశకు గురయ్యాను
  • కానీ, చేయాల్సినంత సాయం చేశాడు
  • 2013లో రెండు సర్జరీల ఖర్చు భరించాడు
  • ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన వినోద్ కాంబ్లీ
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. ముంబై స్కూల్ క్రికెట్ స్థాయిలో ప్రతిభను చాటి ఇద్దరూ ఒకేసారి వెలుగులోకి వచ్చారు. ముఖ్యంగా ఫిబ్రవరి 24, 1988న హారిస్ షీల్డ్‌ ట్రోఫీలో శారదాశ్రమ విద్యామందిర్ తరపున సెయింట్ జేవియర్స్‌పై వీరిద్దరూ రికార్డు స్థాయిలో 664 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో ఇద్దరి పేర్లు దేశవ్యాప్తంగా మార్మోగాయి. చిరస్మరణీయమైన ఈ ఇన్నింగ్స్‌తో ఇద్దరూ పిన్నవయసులోనే భారత జట్టులో అడుగుపెట్టారు.

అయితే, సచిన్, కాంబ్లీ మధ్య స్నేహ బంధం ప్రస్తుతం అంతంత మాత్రంగానే ఉందంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. కొన్నాళ్లుగా చక్కర్లు కొడుతున్న ఈ కథనాలపై వినోద్ కాంబ్లీ మౌనం వీడాడు. మాస్టర్ బ్లాస్టర్‌తో తన స్నేహ బంధంపై మాట్లాడాడు. సచిన్ సాయం చేయలేదని ఆ సమయంలో (2009లో ఇద్దరూ మాట్లాడుకోలేదు) తన మనసుకు అనిపించిందని, చాలా నిరాశకు గురయ్యానంటూ కాంబ్లీ నోరు విప్పాడు.

 ‘‘నిజానికి సచిన్ నాకు చేయాల్సిన సాయం చేశాడు. 2013లో నాకు జరిగిన రెండు సర్జరీల ఖర్చును భరించాడు. మేమిద్దరం మాట్లాడుకున్నాం. చిన్ననాటి స్నేహం సాయం చేయడానికి ముందుకొచ్చింది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు ‘ది వికీ లల్వానీ షో’లో కాంబ్లీ మనసు విప్పి మాట్లాడాడు. 

తన ఆటను మెరుగుపరిచిన ఘనత కూడా సచిన్‌కే దక్కుతుందని కాంబ్లీ తెలిపాడు. భారత జట్టులో తాను అనేకసార్లు పునరాగమనాలు చేయడంలో నిరంతర మద్దతు అందించాడని కొనియాడాడు. ‘‘క్రికెట్ ఎలా ఆడాలో సచిన్ నాకు చెప్పాడు. నేను తొమ్మిది సార్లు జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాను. మేము క్రికెటర్లం. గాయపడినప్పుడు, ఔట్ అయినప్పుడు బాధపడతాం’’ అని వినోద్ కాంబ్లీ చెప్పాడు. 

కాగా, సచిన్ టెండూల్కర్ నవంబర్ 1989లో పాకిస్థాన్‌‌పై అరంగేట్రం చేశాడు. అయితే వినోద్ కాంబ్లీ కొంతకాలం నిరీక్షించాల్సి వచ్చింది. జనవరి 1993లో ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా ఇంగ్లండ్‌పై అరంగేట్రం చేశాడు. అయితే కాంబ్లీ భారత్ తరపున 17 టెస్టులు, 104 వన్డేలు మాత్రమే ఆడాడు. చివరి టెస్ట్ మ్యాచ్‌ను నవంబర్ 1995లో కటక్‌లో న్యూజిలాండ్‌పై ఆడాడు. చివరి వన్డే శ్రీలంకపై అక్టోబర్ 2000లో షార్జా వేదికగా ఆడాడు. అయితే సచిన్ టెండూల్కర్ మాత్రం క్రికెట్‌లో అత్యున్నత శిఖరాలను అందుకున్నాడు.


More Telugu News