రూ. 13 లక్షలు పెట్టి సినిమా తీస్తే.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది!

  • 2007లో ఓరెన్ పెలి దర్శకత్వంలో రూపొందిన ‘పారానార్మల్ యాక్టివిటీ’
  • పారితోషికం ఖర్చులు తగ్గించుకునేందుకు పూర్తిగా కొత్త వారితో రూపొందిన మూవీ
  • ఫిల్మ్ ఫెస్టివల్‌లో సినిమాను చూసి పోస్ట్ ప్రొడక్షన్, మార్కెటింగ్ కోసం 2 లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టిన ‘పారామౌంట్ పిక్చర్స్’
  • ప్రపంచవ్యాప్తంగా 194.2 మిలియన్ డాలర్ల వసూలు
ఏదైనా ఒక సినిమా విజయానికి కొలమానం ఏంటి? కచ్చితంగా వసూళ్లే. ఏ సినిమా విజయానికైనా ఇదే ప్రామాణికం. అయితే, అన్ని వేళలా అదే కాకపోవచ్చు. ప్రపంచం మెచ్చిన సినిమా కమర్షియల్‌గా హిట్ కాకపోవచ్చు. అయితే, సినిమా విజయాన్ని నిర్ధారించేది మాత్రం కలెక్షన్లే. కొన్ని చిన్న సినిమాలు బాక్సాఫీసును కొల్లగొట్టి వసూళ్ల వర్షం కురిపిస్తే.. వందల కోట్లు ఖర్చు చేసి తెరకెక్కించిన సినిమాలు బోల్తా పడిన సందర్భాలు కోకొల్లలు. అయితే, తాజాగా ఇప్పుడు ‘పారానార్మల్ యాక్టివిటీ’ అనే సినిమాపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కారణం అది సాధించిన వసూళ్లే.

టైటానిక్, అవతార్, అవెంజర్స్ ఎండ్‌గేమ్ వంటి సినిమాల సరసన చేరిన ‘పారానార్మల్ యాక్టివిటీ’ సినిమాను 2007లో ఓరెన్ పెలి రూపొందించారు. లో బడ్జెట్‌లో ఓ సినిమాను తీయాలని నిర్ణయించుకున్న ఓరెన్ పెలి.. ఒక హోం కెమెరాతో, మొత్తం కొత్త వారితో ఈ సినిమాకు రూపకల్పన చేశారు. నటులకు అతి తక్కువగా 500 డాలర్ల (దాదాపు రూ. 42 వేలు) పారితోషికం ఇచ్చారు. నిజానికి ఈ సినిమాకు స్క్రిప్ట్ కూడా లేదు. హారర్ సీన్ల కోసం ప్రాక్టికల్ ఎఫెక్ట్‌లనే ఉపయోగించారు. అలా తెరకెక్కించిన సినిమా చివరికి ‘పారానార్మల్ యాక్టివిటీ’గా బయటకు వచ్చింది. ఈ సినిమా కోసం మొత్తంగా 15 వేల డాలర్లు (దాదాపు రూ. 13 లక్షలు) ఖర్చు చేశారు. ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమాను చూసి ఆశ్చర్యపోయిన ‘పారామౌంట్ పిక్సర్చ్’ సంస్థ  పోస్ట్ ప్రొడక్షన్, మార్కెటింగ్ కోసం 2 లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టింది.

సెప్టెంబర్ 2009లో ఈ మూవీ థియేటర్లను పలకరించి అద్భుత విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా 194.2 మిలియన్ డాలర్లు (రూ.1647 కోట్లు) వసూలు చేసింది. అంటే ఏకంగా 13 లక్షల రెట్లు అధికంగా లాభాలు ఆర్జించింది. ఈ సినిమా విజయం అందించిన ఉత్సాహంతో ఆ తర్వాత దీనికి మూడు స్వీక్వెల్స్, రెండు స్పినాఫ్స్‌ తెరకెక్కాయి. అవి కూడా ప్రపంచవ్యాప్తంగా 600 మిలియన్ డాలర్లు వసూలు చేశాయి.


More Telugu News