గబ్బా టెస్ట్.. రిషభ్ పంత్ ఖాతాలో మరో రికార్డు!

  • ఆస్ట్రేలియాతో గబ్బాలో కొనసాగుతున్న మూడో టెస్ట్
  • పంత్ కెరియర్‌లో ఇది 41వ టెస్ట్
  • బుమ్రా బౌలింగ్‌లో ఖావాజాను వికెట్ల వెనుక దొరకబుచ్చుకున్న పంత్
  • ఈ క్యాచ్‌తో 150 మందిని వెనక్కి పంపిన మూడో భారత కీపర్‌గా రికార్డు
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్‌పంత్ ఖాతాలో మరో అరుదైన ఘనత సాధించాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో గబ్బాలో జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు ఆట కొనసాగుతోంది. వర్షం కారణంగా తొలిరోజు ఆట ఆగిపోయింది. అప్పటికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. వర్షం తెరిపినిచ్చి వాతావరణం ఆటకు అనుకూలించడంతో నేడు రెండోరోజు ఆట ప్రారంభమైంది. ఆతిథ్య జట్టు ప్రస్తుతం 3 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. 

పంత్ కెరియర్‌లో ఇది 41వ టెస్టు. బుమ్రా బౌలింగ్‌లో ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖావాజాను వికెట్ల వెనుక దొరకబుచ్చుకున్న పంత్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్యాచ్‌తో పంత్ వికెట్ల వెనుక 150 మందిని అవుట్ చేసిన ఘనత సాధించాడు. ఇందులో 135 క్యాచ్‌లు, 15 స్టంపింగ్‌లు ఉన్నాయి. ఈ ఘనత సాధించిన మూడో భారత వికెట్ కీపర్‌గా పంత్ అవతరించాడు. ఈ జాబితాలో 294 డిస్మిసల్స్‌తో ధోనీ అగ్రస్థానంలో ఉండగా, సయ్యద్ కిర్మానీ 198 డిస్మిసల్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు.


More Telugu News