ఫోన్లపై నిఘాకు ముగ్గురు అధికారులకు ఏపీ ప్రభుత్వం అనుమతి పొడిగింపు

  • ప్రజాభద్రత దృష్ట్యా అనుమానిత మొబైల్, టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలపై నిఘా కోసం అనుమతి పొడిగింపు
  • జీవో ఎంఎస్ 148 ద్వారా ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్
  • 2025 జనవరి 1 నుంచి 2025 డిసెంబర్ 31వ తేదీ వరకు అనుమతులు పొడిగించినట్లు పేర్కొన్న ప్రభుత్వం
ప్రజాభద్రత దృష్ట్యా అనుమానిత మొబైల్, టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలపై నిఘా కోసం ఇచ్చిన అనుమతిని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో ఎంఎస్ నెం.148 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. ఫోన్లపై నిఘా ఉంచేందుకు ఇంటెలిజెన్స్ విభాగం డీజీ లేదా అదనపు డీజీ, కౌంటర్ ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్‌లకు చెందిన ఐజీ లేదా డీఐజీలకు అధికారం ఉంటుంది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

2025 జనవరి 1 నుంచి 2025 డిసెంబర్ 31వ తేదీ వరకు ముగ్గురు అధికారులకు అనుమతులు పొడిగించినట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇండియన్ టెలిగ్రాఫ్, సమాచార సాంకేతిక చట్టం, ఇతర నిబంధనల మేరకు ప్రభుత్వం ప్రజా భద్రత దృష్ట్యా అనుమానిత ఫోన్లు, టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలపై నిఘా పెట్టేందుకు అనుమతిని పొడిగించింది. అయితే.. హోంశాఖ ముఖ్య కార్యదర్శి ముందస్తు అనుమతి ఇచ్చిన తర్వాతే నిర్దేశిత అధికారులు సదరు అనుమానిత ఫోన్లు, ఇంటర్నెట్ సేవలపై నిఘా పెట్టనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది.  
2024HO_MS148.pdf


More Telugu News