ఆన్ లైన్ లో టీటీడీ క్యాలెండర్ల అమ్మకం

--
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. కొత్త ఏడాదికి సంబంధించిన క్యాలెండర్లు, డైరీలను ఆన్ లైన్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది. ఇప్పటివరకు ఆఫ్ లైన్ లో, పోస్టల్ విధానం ద్వారా కొనుగోలు చేసే అవకాశం ఉండగా.. ప్రస్తుతం ఆన్ లైన్ లో ఆర్డర్ చేసి టీటీడీ క్యాలెండర్లు, డైరీలను తెప్పించుకోవచ్చని చైర్మన్ బీఆర్ నాయుడు ట్వీట్ చేశారు. 2025 ఏడాదికి సంబంధించి 12 పేజీలు, 6 పేజీలు, సింగిల్ షీట్, టేబుల్ టాప్ క్యాలెండర్లను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.

శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద సైజు, శ్రీ పద్మావతి సమేతంగా శ్రీవారి ఫొటోతో క్యాలెండర్లను తయారుచేసినట్లు చెప్పారు. వీటితో పాటు డీలక్స్ డైరీలు, చిన్న డైరీలను కూడా ఆన్ లైన్ లో కొనుగోలు చేయవచ్చని వివరించారు. టీటీడీ క్యాలెండర్‌లు, డైరీలు కావాల్సిన వారు www.tirumala.org, ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్‌లో బుక్ చేసుకోవచ్చని అన్నారు. తిరుమల, తిరుపతి, తిరుచానూరు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, న్యూఢిల్లీ, ముంబై, వేలూరులలోని ప్రముఖ బుక్ స్టోర్లలో శ్రీవారి క్యాలెండర్లను నేరుగా కొనుగోలు చేయవచ్చని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వివరించారు.


More Telugu News