బడ్జెట్ పై కేంద్రం కసరత్తు... రాజస్థాన్ లో కీలక సమావేశానికి పయ్యావుల హాజరు

  • 2025-26 సంవత్సరానికి బడ్జెట్ రూపకల్పన
  • కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన సమావేశం
  • ఏపీకి కావాల్సిన నిధులపై పయ్యావుల విజ్ఞప్తి
నూతన సంవత్సరం వస్తుండడంతో వార్షిక బడ్జెట్ పై కేంద్రం కసరత్తులు షురూ చేసింది. 2025-26 సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ రూపకల్పన కోసం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన నేడు రాజస్థాన్ లో కీలక సమావేశం నిర్వహించారు. కేంద్రం కసరత్తులో భాగంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో నిర్మలా సీతారామన్ సంప్రదింపులు జరుపుతున్నారు. 

ఈ క్రమంలో, రాజస్థాన్ లో జరిగిన సమావేశానికి ఏపీ ఆర్ఖిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా హాజరయ్యారు. రాష్ట్ర ఆర్థిక అవసరాలు, ప్రాధాన్యతా రంగాలకు అవసరమైన నిధులు అంశంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు పయ్యావుల వివరించారు. నదుల అనుసంధానం, పూర్వోదయా వంటి స్కీమ్ ల కేటాయింపుల్లో ఏపీకి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. 

"ఏపీలో రెండు వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతోంది. నీటిని సద్వినియోగం చేసుకుని రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి ఏపీ సీయం చంద్రబాబు పట్టిసీమ ద్వారా కృష్ణా-గోదావరి నదుల అనుసంధానం చేపట్టారు. ఇప్పుడు కృష్ణా-పెన్నా నదుల అనుసంధానం చేయాల్సి ఉంది. నదుల అనుసంధానం ద్వారా రాయలసీమ ప్రాంతానికి నీరు అందుతుంది. 

దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లా రాయలసీమలోనే ఉంది. జైసల్మేర్ కంటే అనంతపురంలో తక్కువ వర్షపాతం నమోదవుతుంది. కేంద్రం కూడా నదుల అనుసంధానం పైన దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా ఏపీలో నదుల అనుసంధానికి నిధులు కేటాయించాలి. 

పూర్వోదయా స్కీంలో భాగంగా ఈఏపీ ప్రాజెక్టుల ద్వారా ఏపీకి రాయితీలు అందివ్వాలి. మౌలిక సదుపాయాలు, పోర్టులు, ఎయిర్ పోర్టులు, మెట్రో రైలు వంటి ప్రాజెక్టులకు నిధులను ఈఏపీ ప్రాజెక్టులతో అనుసంధానించాలి. 90:10 పద్దతిన పూర్వోదయా స్కీం నిధులను అందివ్వాలి.

గ్రీన్ ఫీల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ, ఏవియేషన్ యూనివర్సిటీ, సంప్రదాయేతర ఇంధన వనరులపై ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటుకు రూ. 100 కోట్లు ఇవ్వాలి. 

రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు విభజన చట్టం మేరకు ఆర్థిక సాయం అందివ్వాలి. ఏపీలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు. ఐదు టెక్స్ టైల్ క్లస్టర్ల ఏర్పాటుకు నిధులివ్వాలి" అని పయ్యావుల కేశవ్ ఈ సమావేశంలో నిర్మలా సీతారామన్ కు విజ్ఞప్తి చేశారు.


More Telugu News