వచ్చే ఐపీఎల్‌లో వికెట్ కీపింగ్ వదులుకుంటావా? అంటే.. సంజూ శాంసన్ ఆసక్తికర సమాధానం

  • ధృవ్ జురెల్‌ కీపింగ్ చేయాల్సిన సమయం వచ్చిందన్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్
  • ఇద్దరం కలిసి వికెట్ కీపింగ్‌ బాధ్యతలను పంచుకుంటామని భావిస్తున్నట్టు వెల్లడి
  • ఏబీ డివిలియర్స్ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన సంజూ శాంసన్ 
ఐపీఎల్-2025 సీజన్‌లో వికెట్ కీపింగ్ బాధ్యతలను వదులుకొని, యువ ఆటగాడు ధృవ్ జురెల్‌కు అప్పగించే ఆలోచన ఏమైనా ఉందా? అని ప్రశ్నించగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. వికెట్ కీపింగ్ చేసేందుకు జురెల్ కూడా ఆసక్తిగా ఉన్నాడని, ఇదే విషయంపై ఇద్దరి మధ్య సంభాషణ కూడా జరిగిందని చెప్పాడు. 

వికెట్ కీపింగ్‌ బాధ్యతలను ఇద్దరం పంచుకుంటామని భావిస్తున్నట్టు తెలిపాడు. కెప్టెన్‌గా వ్యవహరిస్తూ తానెప్పుడూ ఫీల్డింగ్ చేయలేదని, అది సవాలుతో కూడుకున్నది కావొచ్చని సంజూ శాంసన్ అభిప్రాయపడ్డాడు. అన్నింటి కంటే జట్టు ప్రయోజనాలే ముఖ్యమని, ఆ తర్వాతే ఆటగాళ్ల ప్రాధాన్యత అని స్పష్టం చేశాడు. ఈ మేరకు ఏబీ డివిలియర్స్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజూ శాంసన్ వెల్లడించాడు.

కీపింగ్ బాధ్యతలను పంచుకోవాలని భావిస్తున్నట్టుగా ఇప్పటివరకు తానెక్కడా వెల్లడించలేదని సంజూ శాంసన్ గుర్తుచేశాడు. ధృవ్ జురెల్ టీమిండియాకు టెస్ట్ ఫార్మాట్‌లో రెండవ ప్రాధాన్యత వికెట్ కీపర్‌గా కొనసాగుతున్నాడని, అతడు ఐపీఎల్‌లో కూడా కీపింగ్ చేయాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నాడు. ఇదే విషయంపై ఇద్దరం మాట్లాడుకున్నామని చెప్పాడు. కాగా, సంజూ శాంసన్‌ను రాజస్థాన్ రాయల్స్‌ రూ.18 కోట్లకు రిటెయిన్ చేసుకుంది. వికెట్ కీపర్‌గా రాణిస్తూ కెప్టెన్సీని చేపడుతున్న విషయం తెలిసిందే.


More Telugu News