రైలులో మహిళకు నిప్పంటించి.. ఆమె చనిపోయేంత వరకు కూర్చుని చూశాడు!

  • అమెరికాలోని న్యూయార్క్‌లో ఘటన
  • సబ్‌వే కారు చివరన కూర్చున్న బాధితురాలి వద్దకు వచ్చి నిప్పంటించిన నిందితుడు
  • ఆపై ప్లాట్‌ఫాం బెంచీలో కూర్చుని చనిపోయేంత వరకు చూసిన వైనం
  • వారి మధ్య ఇది వరకు పరిచయం లేదన్న పోలీసులు
  • మరో రైలులో చిక్కిన నిందితుడు
రైలులో ఓ మహిళకు నిప్పంటించిన వ్యక్తి ఆమె పూర్తిగా కాలిపోయేంత వరకు కూర్చుని చూసిన దారుణ ఘటన అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగింది. ఇదొక సెన్స్‌లెస్ కిల్లింగ్, అత్యంత నీచమైన నేరాల్లో ఇదొకటని పోలీసులు అభివర్ణించారు. ఆదివారం ఉదయం 7.30 గంటల సమయంలో బ్లూక్లిన్‌లోని స్టిల్‌వెల్ అవెన్యూ వద్ద జరిగిందీ ఘటన. 

రైలు స్టేషన్‌లోకి రాగానే సబ్‌వే కార్ చివరన చూర్చున్న బాధితురాలి వద్దకు వచ్చిన అనుమానితుడు లైటర్‌తో ఆమె దుస్తులను అంటించాడు. దీంతో క్షణాల్లోనే ఆమెను మంటలు చుట్టుముట్టాయి. స్టేషన్‌లోని పై అంతస్తులో ఉన్న పెట్రోలింగ్ సిబ్బంది వాసనను పసిగట్టి, పొగలు చూసి అప్రమత్తమయ్యారు. రైలు లోపల మంటల్లో చిక్కుకున్న మహిళను గమనించారు. వెంటనే అగ్నిమాక యంత్రం సాయంతో మంటలను అదుపు చేశారు. అయితే, అప్పటికే ఆలస్యం కావడంతో బాధితురాలు మరణించింది. 

నిందితుడు స్టేషన్‌లోనే ప్లాట్‌ఫాం బెంచ్‌పై కూర్చుని ఆమె పూర్తిగా కాలిపోయేంత వరకు చూశాడని పోలీసులు తెలిపారు. నిందితుడు మరో రైలులో పారిపోతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి లైటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలు, నిందితుడికి మధ్య ఎలాంటి సంభాషణ జరగలేదని, వారిద్దరూ ఒకరికి ఒకరు తెలిసి ఉండకపోవచ్చని పోలీసులు తెలిపారు. బాధితురాలిని గుర్తించాల్సి ఉందని చెప్పారు.  


More Telugu News