పార్శిల్ లో మృతదేహం కేసును ఛేదించిన పోలీసులు

  • ఈ నెల 19న పశ్చిమ గోదావరి జిల్లా యండగండి గ్రామంలో ఘటన
  • తులసి అనే మహిళ ఇంటికి పార్శిల్ లో మృతదేహం
  • ఆ రోజు నుంచి పరారీలో ఉన్న తులసి మరిది శ్రీధర్ వర్మ
  • మృతదేహం కాళ్ల గ్రామానికి చెందిన పర్లయ్యదిగా గుర్తింపు
  • శ్రీధర్ వర్మ మొదటి భార్యది, పర్లయ్యది ఒకే ఊరు అని తెలుసుకున్న పోలీసులు
పశ్చిమ గోదావరి జిల్లా యండగండి గ్రామంలో ఇటీవల తులసి అనే ఒంటరి మహిళ ఇంటికి  ఈ నెల 19న పార్శిల్ లో మృతదేహం రావడం తీవ్ర కలకలం రేపింది. తులసి ఫిర్యాదుతో జిల్లా ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి తులసి చెల్లెలి భర్త శ్రీధర్ వర్మ ఆచూకీ లేకుండా పోవడంతో... అతడిపై అనుమానాలు రేగాయి. పార్శిల్ లో వచ్చిన పురుషుడి మృతదేహం ఎవరిదనేది మిస్టరీగా మారింది. 

ఇప్పుడా మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆ పార్శిల్ లో ఉన్న మృతదేహం కాళ్ల గ్రామానికి చెందిన వర్రె పర్లయ్య అనే వ్యక్తిదిగా గుర్తించారు. ఈ హత్య వెనుక ఉన్నది తులసి మరిది శ్రీధర్ వర్మ అని పోలీసులు నిర్ధారించారు. అతడు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని, ఒక్కో పేరుతో ఒక్కో పెళ్లి చేసుకున్న విషయం విచారణలో వెల్లడైంది. ఇప్పుడు హత్యకు గురైన పర్లయ్య... శ్రీధర్ వర్మ మొదటి భార్య గ్రామానికి చెందినవాడు.

పర్లయ్యను శ్రీధర్ వర్మ హత్య చేసి... ఆ డెడ్ బాడీని ఓ చెక్కపెట్టెలో ఉంచి ఓ మహిళ ద్వారా ఆటోలో తులసి ఇంటికి పంపాడు. కాగా, శ్రీధర్ వర్మ హైదరాబాదులో ఉన్నట్టు అనుమానిస్తున్న పోలీసులు అక్కడికి ప్రత్యేక బృందాన్ని పంపారు. 

ఇక, తులసి ఫోన్ కు వచ్చిన మెసేజ్ లు, కాల్ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. పదేళ్ల క్రితమే భర్త నుంచి దూరంగా ఉంటున్న తులసికి ఎవరు ఫోన్లు చేశారన్న విషయాన్ని పరిశీలిస్తున్నారు.


More Telugu News