ఉత్తర కొరియా సైన్యంపై జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు

  • 3 వేలకు పైగా నార్త్‌ కొరియా సైన్యం మృతి
  • రష్యా, ఉత్తర కొరియా మధ్య భారీగా సాంకేతికత బదిలీ
  • ప్రపంచ దేశాలకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడి హెచ్చరిక
రష్యా, ఉక్రెయిన్‌ మధ్య గత మూడేళ్లుగా భీకరంగా యుద్ధం జరుగుతున్న విష‌యం తెలిసిందే. ఎలాగైనా ఉక్రెయిన్‌ను తన అధీనంలోకి తీసుకోవాలని రష్యా ప్రయత్నిస్తుండగా.. రష్యా ఆగడాలకు చెక్‌ పెట్టాలనే లక్ష్యం, నాటోలో చేరాలనే తలంపుతో ఉక్రెయిన్‌ యుద్ధం చేస్తోంది. ఈ యుద్ధంలో రెండు దేశాలు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. అయితే, నాటో దేశాల సహకారంతో ఉక్రెయిన్‌ పెద్ద ఎత్తున పోరాటం చేస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా కూడా తన మిత్రదేశం ఉత్తర కొరియా సహకారం తీసుకుంటోంది. ఉత్తర కొరియాకు చెందిన సైన్యం ఈ యుద్ధంలో ప్రత్యక్ష సహకారం అందిస్తోంది.  

ఇప్పటికే ఆ దేశానికి చెందిన వేలాది మంది సైన్యం ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో యుద్ధం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఉత్తర కొరియా సైన్యంపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా తరపున ఉక్రెయిన్‌లో యుద్ధం చేస్తున్న ఉత్తర కొరియా సైనికులు వేలాది మంది ఇప్పటికే ఈ యుద్ధంలో భారీగా గాయపడటమో లేదా చనిపోవడమో జరిగిందన్నారు. 

3 వేల మందికి పైగా నార్త్‌ కొరియా సైనికులు చనిపోయి ఉండవచ్చని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. భారీగా సైనికులు నష్టపోతున్నా రష్యా, ఉత్తర కొరియాలు వెనకడుగు వేయడం లేదని, రెండు దేశాల మధ్య అడ్వాన్డ్స్‌ లెవెల్‌లో యుద్ధ విన్యాసాలు, సాంకేతికత బదిలీ జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

మాస్కో, ప్యాంగ్యాంగ్‌ మధ్య బంధం మరింత పెరిగితే ప్రపంచ దేశాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ప్రపంచ దేశాలు ఇప్పటికైనా స్పందించాలని జెలెన్‌స్కీ హెచ్చరించారు. మాస్కోతో ఉన్న అనుబంధం మేరకు కిమ్‌ మరిన్ని బలగాలను పంపిస్తున్నారని, ఆయుధాలను కూడా ఈ యుద్ధానికి వినియోగిస్తున్నారని ఆయ‌న‌ తెలియజేశారు. రష్యా చేస్తున్న దాడులకు ప్రతిగా ఉక్రెయిన్‌ సైతం ఎదురు దాడులు చేస్తోంది. అయితే, అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్‌ ఈ యుద్ధానికి త్వరలోనే చెక్‌ పెడతానని స్ప‌ష్టం చేశారు. 


More Telugu News