న్యాయవాదిపై ఏపీ హైకోర్టు న్యాయమూర్తి సీరియస్!

  • విచారణ వాయిదా వేసిన తర్వాత కూడా వాదనలు బిగ్గరగా కొనసాగించిన న్యాయవాది
  • మధ్యంతర ఉత్తర్వుల కోసం పట్టుబట్టిన న్యాయవాది
  • షోకాజ్ నోటీసులు ఇచ్చిన న్యాయమూర్తి 
ఏపీ హైకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా న్యాయవాది ప్రవర్తించిన తీరుకు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ప్రవర్తించిన తీరుకు కోర్టుధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ షోకాజ్ నోటీసు కూడా జారీ చేశారు. 

ఆ వివరాలలోకి వెళితే.. నెల్లూరులో వీధి వ్యాపారుల దుకాణాల కేటాయింపు టెండర్‌కు సంబంధించిన నిబంధనలను ప్రశ్నిస్తూ దాఖలైన ఓ పిటిషన్‌పై సోమవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ల తరపు న్యాయవాది గుండాల శివ ప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ దుకాణాల టెండర్ ప్రక్రియలో తదుపరి చర్యలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అయితే వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. 

దీంతో న్యాయమూర్తి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. న్యాయమూర్తి పిటిషన్‌పై విచారణను వాయిదా వేసినప్పటికీ పిటిషనర్ల తరపు న్యాయవాది శివప్రసాద్‌రెడ్డి బిగ్గరగా వాదనలు వినిపిస్తూ, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ పట్టుబట్టారు. ఈ తీరు కోర్టుపై ఒత్తిడి తెచ్చేదిగా ఉందని, ఓ న్యాయవాది నుంచి ఇలాంటి తీరును ఊహించలేదని న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేస్తూ నోటీసు జారీ చేశారు.  


More Telugu News