బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

  • తన మోకాలి గాయంతో ఎలాంటి ఇబ్బంది లేదని క్లారిటీ ఇచ్చిన హిట్‌మ్యాన్
  • విరాట్ కోహ్లీ సొంతంగా లోపాలను అధిగమిస్తాడంటూ ఆశాభావం
  • యశస్వి జైస్వాల్‌ను స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయనిస్తామంటూ వెల్లడి
  • గురువారం నుంచి భారత్-ఆసీస్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య గురువారం (డిసెంబర్ 26) నుంచి మెల్‌బోర్న్ వేదికగా నాలుగవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం  కానుంది. సిరీస్‌లో ప్రస్తుతానికి 1-1తో సమంగా ఉండడంతో ఈ మ్యాచ్‌లో గెలిచి ఆధిక్యం సాధించాలని ఇరు జట్లు పట్టుదలతో కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తన మోకాలి గాయం విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని, బాక్సింగ్ డే టెస్టులో ఆడుతున్నానని చెప్పాడు. గాయంతో ఎలాంటి ఇబ్బందిలేదని స్పష్టత ఇచ్చాడు. అయితే, తాను బ్యాటింగ్ చేయబోయే స్థానంపై రోహిత్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. జట్టుకు ఏది మంచిదైతే అది చేస్తానని వ్యాఖ్యానించాడు. ఎవరు ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తారనే దాని గురించి చింతించవద్దని ఈ సందర్భంగా హిట్‌మ్యాన్ వ్యాఖ్యానించాడు.

ఇక విరాట్ కోహ్లీ ఫామ్, బ్యాటింగ్‌లో ఈ మధ్య తరచుగా కనిపిస్తున్న ‘ఆఫ్ స్టంప్’ లోపాలపై మీడియా ప్రశ్నించగా... విరాట్ కోహ్లీ దిగ్గజ ఆటగాడని, లోపాలను అధిగమించే మార్గాన్ని కనుగొంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘‘కోహ్లీకి ఆఫ్ స్టంప్ లోపమా... ఆధునిక దిగ్గజ క్రికెటర్ అని మీరే చెబుతుంటారు. ఆధునిక దిగ్గజాలు సొంతంగా గాడిలో పడతారు’’ అని రోహిత్ శర్మ చెప్పాడు.

యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌ను స్వేచ్ఛగా ఆడనిస్తామని, ప్రోత్సాహం ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. ‘‘జైస్వాల్ మైండ్‌సెట్‌ను మార్చకూడదు. అతడు తన బ్యాటింగ్‌ను మా అందరికంటే ఎక్కువగా అర్థం చేసుకున్నాడు. స్వేచ్ఛగా ఆడమంటూ ప్రోత్సహిస్తాం’’ అని కెప్టెన్ చెప్పాడు.




More Telugu News