జట్టును నడిపించలేకపోయానన్న బాధ లేదు కానీ.. కెప్టెన్సీపై అశ్విన్ కీలక వ్యాఖ్యలు

  • ఇచ్చి ఉంటే మరింత ఎంజాయ్ చేసి ఉండేవాడినన్న అశ్విన్
  • కెప్టెన్సీకి సరిపోతానని తాను అనుకుంటే సరిపోదన్న ఆఫ్ స్పిన్నర్ 
  • మరో 25-30 అనుకుంటేనే అది వస్తుందని వ్యాఖ్య
  • కెరియర్ ఆరంభంలోనే కెప్టెన్సీని రుచి చూశానన్న అశ్విన్
భారత జట్టుకు కెప్టెన్ కాలేకపోయానన్న బాధ తనకు లేదని అంతర్జాతీయ క్రికెట్‌కు ఇటీవల వీడ్కోలు పలికిన టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నాడు. అయితే, తనకు సారథ్య బాధ్యతలు నిర్వర్తించే సత్తా ఉందని, ఆ అవకాశం లభించి ఉంటే సంతోషించి ఉండేవాడినని చెప్పుకొచ్చాడు.

ఏజ్ గ్రూప్ క్రికెట్‌తోపాటు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అశ్విన్ తన జట్టుకు నాయకత్వం వహించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పంజాబ్ కింగ్స్ జట్టుకు 2018, 2019 సీజన్లలో సారథ్యం వహించాడు. అయితే, కెప్టెన్‌గా భారత టెస్టు జట్టును నడిపించే అవకాశం రాలేదు. అంతేకాదు, వైస్ కెప్టెన్‌‌గా పనిచేసే అవకాశం కూడా అతడికి లభించలేదు.

తన విషయంలో ఏం జరిగిందో అర్థం చేసుకోగలనన్న అశ్విన్.. కెరియర్ మొదలు పెట్టినప్పుడే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కెప్టెన్సీ అవకాశం వచ్చిందని గుర్తు చేసుకున్నాడు. జట్టు కోసం కొన్ని టోర్నీలు గెలిచానని పేర్కొన్నాడు. అయితే, జాతీయ జట్టును నడిపించలేకపోయానన్న బాధ తనకు లేదని ‘స్కై స్పోర్ట్స్’ పాడ్‌కాస్ట్‌లో అశ్విన్ తెలిపాడు. 

కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తించగలనని కొందరు అనుకోవాలన్న విషయం తనకు తెలుసని, అలా 25-30 మంది అనుకుంటేనే ఆ బాధ్యతలు అందుతాయని కూడా తనకు తెలుసని చెప్పుకొచ్చాడు. కాకపోతే, కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించి ఉంటే ఎంజాయ్ చేసి ఉండేవాడినని అశ్విన్ వివరించాడు.


More Telugu News