టీ20 వరల్డ్ కప్ జట్టులో ముగ్గురు తెలుగు అమ్మాయిలు

  • గొంగడి త్రిష, కేసరి ధృతితో పాటు షబ్నమ్ కు చోటు
  • జనవరి 18 నుంచి కౌలాలంపూర్ లో అండర్ 19 వరల్డ్ కప్
  • మంగళవారం జట్టును ప్రకటించిన బీసీసీఐ కమిటీ
మహిళల ఆసియా కప్ లో అదరగొట్టిన హైదరాబాదీ యువతి గొంగడి త్రిష అండర్ 19 టీ20 ప్రపంచ కప్ తుది జట్టులో చోటు దక్కించుకుంది. త్రిషతో పాటు కేసరి ధృతి, షబ్నమ్ ను బీసీసీఐ ఎంపిక చేసింది. మొత్తం 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ మహిళల ఎంపిక కమిటీ ప్రకటించింది. కెప్టెన్ గా నిక్కీ ప్రసాద్‌, వైస్ కెప్టెన్‌ గా సానికా చల్కే వ్యవహరిస్తారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు అమ్మాయిలకు తుది జట్టులో చోటు దక్కడం విశేషం.

ఇద్దరు వికెట్‌ కీపర్లను తీసుకోవడంతో పాటు మరో ముగ్గురిని స్టాండ్ బై ప్లేయర్లుగా కమిటీ ఎంపిక చేసింది. గొంగడి త్రిష, కేసరి ధృతి హైదరాబాద్ కు చెందిన వారు కాగా షబ్నమ్ విశాఖపట్నం యువతి. ఇటీవల జరిగిన మహిళల అండర్ 19 ఆసియా కప్ టోర్నీలో త్రిష సత్తా చాటింది. అర్ధ శతకం బాది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచింది. కాగా, కౌలాలంపూర్‌ వేదికగా జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఈ టోర్నీ జరగనుంది. గ్రూప్‌ దశలో భాగంగా జనవరి 19న టీమ్‌ఇండియా వెస్టిండీస్‌, 21న మలేసియా, 23న శ్రీలంకతో తలపడనుంది.

టీ20 మహిళల జట్టు..
నిక్కీ ప్రసాద్‌ (కెప్టెన్‌), సానికా చల్కే (వైస్‌ కెప్టెన్‌), గొంగడి త్రిష, కమిలిని జి(వికెట్‌ కీపర్‌), భవికా అహిరె (వికెట్‌ కీపర్‌), ఈశ్వరి అవసరె, మిథిలా వినోద్‌, జోషితా వీజే, సోనమ్‌ యాదవ్‌, పర్ణికా సిసోదియా, కేసరి ధృతి, ఆయుషి శుక్లా, ఆనందితా కిశోర్‌, షబ్నమ్‌, వైష్ణవి ఎస్‌.. వీరితో పాటు నందన ఎస్‌, ఐరా జే, అనధి టి లను స్టాండ్‌బై ప్లేయర్లుగా బీసీసీఐ ఎంపిక చేసింది.


More Telugu News