జైల్లో నందిగం సురేశ్ ను ఎలా ఉంచాలనేది నేరుగా సీఎం కుమారుడే ఫోన్ చేసి చెబుతున్నారు: సజ్జల

  • జైల్లో ఉన్న నందిగం సురేశ్ ను పరామర్శించిన సజ్జల
  • నందిగం సురేశ్ కు కనీస సదుపాయాలు కూడా అందించడం లేదని విమర్శ
  • వాటర్ బాటిల్ కూడా అనుమతించడం లేదని మండిపాటు
గుంటూరు జైల్లో ఉన్న వైసీపీ మాజీ  ఎంపీ నందిగం సురేశ్ ను వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శించారు. అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడుతూ... నందిగం సురేశ్ అక్రమ కేసుల్లో అరెస్ట్ అయి నాలుగు నెలలు అవుతోందని చెప్పారు. ఆధారాలు లేకుండానే కేసులు పెట్టారని విమర్శించారు. కోర్టుల్లో ఉన్న లొసుగులను ఉపయోగించి జైల్లో ఉంచుతున్నారని చెప్పారు. 

నందిగం సురేశ్ కు జైల్లో కనీస సదుపాయాలను కూడా అందించడం లేదని సజ్జల విమర్శించారు. వాటర్ బాటిల్ కూడా అనుమతించడం లేదని చెప్పారు. జైల్లో నందిగం సురేశ్ ను ఎలా ఉంచాలనేది నేరుగా ముఖ్యమంత్రి కుమారుడే ఫోన్ చేసి చెబుతున్నారని దుయ్యబట్టారు. 

30 ఏళ్ల క్రితం నక్సలైట్లను అరెస్ట్ చేసినట్టు... సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టిన వారిని అరెస్ట్ చేస్తున్నారని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసమే ఉపయోగించాలని చెప్పారు. కక్ష తీర్చుకోవడంలో కూటమి ప్రభుత్వం కొత్త కొత్త పద్ధతులను ఉపయోగిస్తోందని అన్నారు. మీ కంటే బలంగా కొట్టే శక్తి వైసీపీకి ఉందని... నాలుగేళ్లలో తాము మళ్లీ అధికారంలోకి వస్తామని... అప్పుడు తాము చెప్పినా తమ వాళ్లు వినే పరిస్థితి ఉండదని హెచ్చరించారు.


More Telugu News