ఓటీటీల చలవ .. మలయాళ ఆర్టిస్టులకు పెరుగుతున్న క్రేజ్!
- ఓటీటీలలో మలయాళ సినిమాల జోరు
- అక్కడి స్టార్స్ ను అభిమానిస్తున్న ప్రేక్షకులు
- వారి సినిమాలను ఫాలో అవుతున్న వైనం
- తెలుగు సినిమాల్లో బిజీ అవుతున్న మలయాళ స్టార్స్
ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ ఆర్టిస్టులు బాగా తెలిసేవారు. అక్కడి నుంచి హీరోయిన్స్ .. విలన్స్ దిగుమతి ఇక్కడికి ఎక్కువగా జరుగుతూ ఉండేది. ఆ తరువాత తమిళ ఆర్టిస్టులు తెలిసేవారు. కన్నడ .. మలయాళ సినిమాలకి సంబంధించిన ఆర్టిస్టుల తాకిడి ఇక్కడ అంతగా ఉండేది కాదు. మలయాళం నుంచి మమ్ముట్టి .. మోహన్ లాల్ .. సురేశ్ గోపీ వంటి కొంతమంది హీరోలు మాత్రమే ఇక్కడివారికి పరిచయం. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. బాలీవుడ్ నుంచి ఇక్కడికి వచ్చే ఆర్టిస్టుల జోరు తగ్గిపోయిందనే చెప్పాలి. టాలీవుడ్ - కోలీవుడ్ ఆర్టిస్టులు మాత్రం పూర్తి సహాయ సహకారాలతో ముందుకు వెళుతున్నారు. ఇక ఈ మధ్యనే కన్నడ సినిమాల అనువాదాలు కూడా ఇక్కడ జోరందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఓటీటీ సినిమాల పుణ్యమా అని మలయాళ ఆర్టిస్టులు తెలుగు ప్రేక్షకులకు చేరువవుతున్నారు. మలయాళ ఇండస్ట్రీ నుంచి ఫహాద్ ఫాజిల్ .. జోజూ జార్జ్ .. షైన్ టామ్ చాకో .. టోవినో థామస్ వంటి హీరోల ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఓటీటీల్లో వారి సినిమాల అనువాదాలు చూసిన ప్రేక్షకులు అభిమానిస్తున్నారు .. ఆదరిస్తున్నారు. ఇక అసిఫ్ అలీ .. కుంచాకో బోబన్ .. బాసిల్ జోసెఫ్ వంటి ఆర్టిస్టులతోను తెలుగు వారికి పరిచయం పెరిగింది. అందువలన వారి సినిమాలను ఫాలో అవుతున్నారు. త్వరలో వీరు కూడా ఇక్కడి సినిమాలలో కనిపించే ఛాన్స్ లేకపోలేదు.