ఆంధ్రా మోడల్ ఎడ్యుకేషన్ దిశగా పాఠశాల విద్యలో సంస్కరణలు

  • విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి 16,437 టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు
  • పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు కృషి
  • జనవరి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
  • ప్రభుత్వ స్కూళ్లను ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దేందుకు మంత్రి లోకేశ్ చర్యలు
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్ది ఆంధ్రా మోడల్ ఎడ్యుకేషన్‌ను తెచ్చేందుకు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా పాఠశాల విద్యను సమూలంగా ప్రక్షాళన చేసే దిశగా చర్యలు ప్రారంభించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ ఫైలుపై ముఖ్యమంత్రి సంతకం చేయగా, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి రిక్రూట్‌మెంట్ పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. మెగా డీఎస్సీలో ఎక్కువమంది నిరుద్యోగ టీచర్లకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET)ను పారదర్శకంగా నిర్వహించారు.

అత్యంత పారదర్శకంగా నిర్వహించిన టెట్‌లో 1,87,256 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. గత ప్రభుత్వం అనాలోచితంగా విడుదల చేసిన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు గొడ్డలిపోటు లాంటి జీఓ 117ని రద్దు చేసి, కొత్త డ్రాఫ్ట్ మోడల్‌ను సిద్ధం చేశారు. కొత్త పోస్టుల భర్తీ ప్రారంభమయ్యేలోగా విద్యాబోధనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా 9,197 ఉపాధ్యాయ స్థానాలను సర్దుబాటు ద్వారా భర్తీ చేశారు. ప్రభుత్వస్కూళ్లను రాజకీయాలకు అతీతంగా సీఎంతో సహా ఎటువంటి రాజకీయ నేతల ఫోటోలు లేకుండా అకడమిక్ క్యాలెండర్ రూపొందించారు.

విద్యాశాఖకు సంబంధించిన వివిధ పథకాలకు రాజకీయలకు సంబంధం లేని స్ఫూర్తి ప్రదాతల పేర్లు పెట్టారు. స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (SMC) ఎన్నికలు విజయవంతంగా నిర్వహించడమేగాక దేశంలోనే తొలిసారిగా 44వేల ప్రభుత్వ పాఠశాలల్లో 7 డిసెంబర్ 2024న మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో పండుగ వాతావరణంలో నిర్వహించారు.

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు సలహాలతో విద్యార్థుల్లో విద్యతో పాటు నైతిక విలువలను పెంపొందించేలా పాఠ్యాంశాలు రూపొందించేందుకు చర్యలు చేపట్టారు. రాబోయే అయిదేళ్లలో ఆంధ్రా మోడల్ విద్యావ్యవస్థను తయారు చేసేందుకు గత ఆరునెలలుగా మంత్రి లోకేశ్ చేస్తున్న ప్రణాళికాబద్ధమైన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. 

పాఠ్యాంశాల్లో మార్పులకు చర్యలు

మారుతున్న కాలానికి అనుగుణంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020, నిపుణ్ భారత్‌కు అనుగుణంగా పాఠ్యపుస్తకాలు, పాఠ్య ప్రణాళికలో మార్పులకు కసరత్తు ప్రారంభించారు. విద్యాసంస్కరణల్లో యునిసెఫ్‌తో పాటు ప్రథమ్, జె-పాల్, మది, లీడర్ షిప్ ఈక్విటీ (ఎల్ఎఫ్ఇ) వంటి ప్రముఖ సంస్థల భాగస్వామ్యంలో భాగంగా ఉత్తమ బోధనా పద్ధతులకు శ్రీకారం చుట్టారు. బడి బయట ఉన్న 84,640 మంది విద్యార్థులకు నాన్-రెసిడెన్షియల్ స్పెషల్ డ్రైటింగ్ సెంటర్లు  (NRSTCలు), సీజనల్ హాస్టల్స్ ద్వారా మెయిన్ స్ట్రీమ్‌లోకి తెచ్చారు. ప్రతి బిడ్డను సమర్థవంతంగా ట్రాక్ చేయడానికి ICDS, హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్, పాఠశాల విద్యా విభాగాల నుండి డేటాబేస్‌లను సమగ్రపరిచేందుకు చర్యలు చేపట్టారు.

నమోదు చేసుకున్న విద్యార్థులలో 80% మందికి APAAR IDలు రూపొందించారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించేందుకు ఐఐటీ మద్రాస్‌తో అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకున్నారు. SCERTలో ఖాళీలను భర్తీ చేశారు. కేజీబీవీల్లో 342 మంది బోధన, 991 మంది బోధనేతర సిబ్బందిని నియమించారు. కెరీర్ ప్లానింగ్, మానసిక ఎదుగుదల, సంఘర్షణల పరిష్కారంలో విద్యార్థులకు మద్దతు ఇవ్వడానికి 255 మంది కెరీర్, మానసిక ఆరోగ్య సలహాదారులను నియమించారు. విద్యార్థుల్లో డిజిటల్ సౌలభ్యాన్ని పెంపొందించడం, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు (CwSN) సమగ్ర క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలను పెంపొందించడంలో ఏపీ ప్రభుత్వం చేసిన కృషిని కేంద్రం గుర్తించింది. వికలాంగుల హక్కుల చట్టం అమలులో ఉత్తమ రాష్ట్రంగా నిలిపినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సర్వశిక్ష అభియాన్ స్టేట్ ప్రాజెక్టు డైరక్టర్ బి.శ్రీనివాసరావు ఇటీవల ఢిల్లీలో జాతీయ అవార్డును అందుకున్నారు.

అకడమిక్, మౌలిక సదుపాయాలకు స్టార్ రేటింగ్

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 44 వేల పైచిలుకు పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం, ప్రతిభ ఆధారంగా అకడమిక్ స్టార్ రేటింగ్, తరగతి గదుల్లో మౌలిక వసతులు, టాయ్‌లెట్లు, తాగునీటి సౌకర్యం వంటి 18 అంశాల ప్రాతిపదికన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఆయా పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్న రేటింగ్ మెరుగుదలకు రూట్ మ్యాప్ నిర్దేశించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో టీచ్ టూల్ ఉపయోగించి ఉపాధ్యాయుల బోధన నైపుణ్యాలను అంచనా వేసి బోధనా పద్ధతుల మెరుగుదలకు చర్యలు చేపట్టారు. ప్రధానోపాధ్యాయుల స్వీయ-అవగాహన, స్వీయ-నిర్వహణ, కమ్యూనికేషన్, సమస్యల పరిష్కరంతో సహా కీలక నాయకత్వ సామర్థ్యాల్లో శిక్షణ ఇచ్చారు.

విద్యార్థులకు పోషక విలువలతో కూడిన మధ్యాహ్న భోజనం అందించేందుకు ఆయా ప్రాంతాల్లోని అభిరుచులకు తగ్గట్లుగా మెనూ మార్పు చేశారు. జనవరి నుంచి KGBV స్కూళ్లలో డైట్ ఛార్జీలను రూ.1,400 నుండి రూ.1,600కు పెంచేలా ఉత్తర్వులు జారీ చేశారు. మెగా పేరెంట్-టీచర్ సమావేశాల సందర్భంగా, విద్యార్థుల పనితీరుతో పాటు పాఠ్యాంశాలు, పాఠ్యేతర కార్యకలాపాలలో వారు సాధించిన విజయాలను పొందుపరుస్తూ హోలిస్టిక్ రిపోర్ట్ కార్డ్‌లు తల్లిదండ్రులకు అందజేశారు.హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ వారిచే స్క్రీనింగ్ చేసిన విద్యార్థుల హెల్త్ ప్రొఫైల్‌లను వివరించే హెల్త్ కార్డ్‌లను కూడా అందజేశారు.

ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం గత ఆరునెలల్లో ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఆయా కళాశాలల పనివేళలను ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పొడిగించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, KGBVలు, AP మోడల్ స్కూల్‌లు, AP రెసిడెన్షియల్ విద్యాసంస్థలు, ఉన్నత పాఠశాల ప్లస్‌లను కవర్ చేస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 2 లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌లు, స్కూల్ బ్యాగ్‌లు ఉచితంగా అందించారు. ఆర్జేడీల పర్యవేక్షణలో జిల్లా, ప్రాంతీయ స్థాయిల్లో అకడమిక్ గైడెన్స్, మానిటరింగ్ సెల్‌లు ఏర్పాటు చేశారు.

11వ, 12వ తరగతి విద్యార్థుల ఇంటర్నల్ పరీక్షల కోసం కేంద్రీకృత ప్రశ్నపత్రాల తయారీ విధానాన్ని ప్రవేశపెట్టారు. జనవరి, ఫిబ్రవరి 2025లో నిర్వహించే రెండు ప్రీ-ఫైనల్ పరీక్షలు కూడా ఇదే విధానంలో నిర్వహిస్తారు. వెనుకబడిన విద్యార్థుల ప్రాక్టీస్ కోసం విద్యార్థులందరికీ కొచ్చన్ బ్యాంకులను అందజేశారు. ఉత్తీర్ణత శాతం మెరుగుదలకు ప్రతి 10-15 మంది విద్యార్థులను టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌తో అనుసంధానం చేస్తూ అన్ని జూనియర్ కళాశాలల్లో మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ అమలు చేస్తున్నారు. ఇంటర్మీడియట్ చదివే విద్యార్థుల కోసం రాష్ట్రంలోని 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జనవరి నుంచి మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలని నిర్ణయించారు. 

రాబోయే ఆరు నెలలకు రూట్ మ్యాప్!

ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ప్రమాణాలు మెరుగుపర్చేందుకు రాబోయే ఆరు నెలల్లో చేపట్టాల్సిన చర్యలపై రూట్ మ్యాప్ రూపొందించారు. స్కూళ్ల వారీగా ఆయా పాఠశాలల వాస్తవస్థితిని తెలుసుకునేందుకు 'ఒక పాఠశాల-ఒక యాప్' పేరుతో సమగ్ర డాష్‌బోర్డ్ సిద్ధమవుతోంది. రాష్ట్రస్థాయి సైన్స్ ఎక్సో పో, జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నేతృత్వంలో స్పోర్ట్స్/గేమ్స్ మీట్ నిర్వహించాలని నిర్ణయించారు. విద్యాసంవత్సరం చివరి పనిదినం రోజున మరోమారు మెగా PTM నిర్వహించి విద్యాప్రమాణాల మెరుగుదలకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించాలని నిర్ణయించారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాడే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం కింద 1 నుండి 12 తరగతులకు కొత్త యూనిఫారాలు, బ్యాగ్‌లను అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

పాఠ్యపుస్తకాలతో పాటు ఇంటర్ విద్యార్థులకు పోటీ పరీక్షల మెటీరియల్‌, మాన్యువల్‌, నోట్‌బుక్‌లు, రికార్డులను అందజేయాలని నిర్ణయించారు. స్టార్ రేటింగ్‌ను మెరుగుపరచడానికి పాఠశాల వారీగా ప్రణాళికలు రూపొందించారు. 2025-26 విద్యా సంవత్సరం నుండి 1 నుండి 12 తరగతుల పాఠ్యాంశాల్లో సమూల మార్పులు తేవాలని నిర్ణయించారు. IIT మద్రాస్‌తో కలిసి విద్యా శక్తి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేలా చర్యలు చేపట్టారు. పాఠశాల నిర్వహణ నైపుణ్యాలను మెరుగుపరచడానికి ప్రధానోపాధ్యాయుల కోసం ఆన్‌లైన్ నాయకత్వ కోర్సులను నిర్వహించాలని నిర్ణయించారు. అకడమిక్ క్యాలెండర్‌ను సమర్థవంతంగా అమలుచేయడంతో పాటు డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్  మెరుగుదల, ఫిజికల్, వర్చువల్ విద్యను ఏకీకృతం చేయడం ద్వారా మెరుగైన బోధన విధానాలను అమలు చేయాలని నిర్ణయించారు.

విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాల పెంపుదలకు ఫిజికల్ ఎడ్యుకేషన్ పై దృష్టి సారించారు. ఇందులో భాగంగా స్పోర్ట్స్ కిట్స్ అందజేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హైస్కూళ్ళలో కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటుకు చేయాలని నిర్ణయించారు. ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ఇంటర్మీడియట్ బోర్డ్ సర్టిఫికేషన్‌తో పాటు నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్ వర్క్ ( NSQF), నేషనల్ కౌన్సిల్ ఫర్ వెకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (NCVET) సహకారంతో 11, 12వ తరగతుల వృత్తి విద్యార్ధులకు డ్యుయల్ ధృవీకరణ పత్రాలను అందజేసేలా కసరత్తు చేస్తున్నారు.

అన్ని ముఖ్యమైన అకడమిక్ అప్‌డేట్‌లు, సమాచారాన్ని అందజేసేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సాంకేతిక సమస్యలను పరిష్కరించి నూరుశాతం APAAR IDలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ప్రైవేటు విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు గత ఆరు నెలలుగా మంత్రి లోకేశ్ చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి.


More Telugu News