నేడు విశాఖలో ప్రధాని మోదీ పర్యటన ఇలా.. 2.08 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు

  • చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో కలిసి విశాఖలో రోడ్ షో, బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని మోదీ
  • రూ.2.08 లక్షల కోట్ల ప్రాజెక్టులకు మోదీ చేతుల మీదుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
  • మోదీ పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ప్రధాని రాక సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. విశాఖపట్నం పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి వర్చువల్‌‌గా సుమారు రూ.2.08 లక్షల కోట్ల విలువైన 20 వరకూ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు, తదితర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు. 
 
ఈ రోజు (బుధవారం) సాయంత్రం 4.15 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమానంలో విశాఖపట్నం చేరుకుని సా.4.45 నుంచి 5.30 గంటల వరకూ రోడ్డు షోలో పాల్లొంటారు. అనంతరం సా.5.30 నుంచి 6.45 గంటల వరకూ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానం సభా వేదిక వద్ద నుండి వర్చువల్‌గా పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి సభలో ప్రసంగిస్తారు. తదుపరి సాయంత్రం 6.50 గంటలకు సభా వేదిక నుంచి బయలుదేరి విశాఖ విమానాశ్రయానికి చేరుకుని రాత్రి 7.15 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి భువనేశ్వర్ వెళతారు. 
 
ప్రధాని మోదీ వర్చువల్‌గా విశాఖపట్నం రైల్వే జోన్ ప్రధాన కేంద్రం సహా పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోడ్, గుంటూరు-బీబీనగర్, గుత్తి-పెండేకల్లు రైల్వే లైన్ల డబులింగ్ వంటి పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. అదే విధంగా 16వ నంబరు జాతీయ రహదారిలో చిలకలూరిపేట 6 లైన్ల బైపాస్‌ను జాతికి అంకితం చేయడంతో పాటు పలు జాతీయ రహదార్లు, రైల్వేలైన్ల‌ను వర్చువల్‌గా ప్రధాని ప్రారంభిస్తారు. 


More Telugu News