ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పారిపోతున్న హాలీవుడ్ సెలబ్రిటీలు.. మంటల్లో తగలబడుతున్న ఇళ్లు.. వీడియో ఇదిగో!

  • అమెరికాలోని కాలిఫోర్నియాలో కార్చిచ్చు
  • లాస్ ఏంజిల్స్ లోని ది సాలిసడ్స్ ప్రాంతాన్ని చుట్టుముట్టిన మంటలు
  • దాదాపు 3 వేల ఎకరాల దగ్ధం
అమెరికాలోని లాస్ ఏంజిల్స్ సిటీలో కార్చిచ్చు చెలరేగింది. హాలీవుడ్ సెలబ్రిటీలు నివాసం ఉండే అత్యంత ఖరీదైన ఏరియా ‘ది సాలిసాడ్స్’ ను మంటలు చుట్టుముట్టాయి. దీంతో వేలాది ఎకరాల్లోని విలాసవంతమైన ఇళ్లు కాలిబూడిదవుతున్నాయి. మంటలు వ్యాపిస్తుండడంతో ఇల్లూ వాకిలి వదిలేసి కట్టుబట్టలతో సెలబ్రిటీలు పారిపోతున్నారు. దాదాపు మూడు వేల ఎకరాల్లో మంటలు వ్యాపించాయని, 13 వేల నిర్మాణాలకు మంటలు అంటుకున్నాయని అమెరికా మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. కార్చిచ్చు చెలరేగడంతో అధికారులు వేగంగా స్పందించారు. దాదాపు 30 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా, హాలీవుడ్‌ స్టార్లు టామ్‌ హాంక్స్‌, రీస్‌ విథర్స్పూన్‌, స్పెన్సర్‌ ప్రాట్‌, హెడీ మోంటాగ్‌ తదితరుల ఇళ్లు మంటల్లో కాలి బూడిదయ్యాయని సమాచారం.

ఓవైపు ఎగసిపడుతున్న మంటలు, మరోవైపు పొగ కమ్మేయడంతో స్థానికులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. వాహనాల్లో అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయే ప్రయత్నం చేయడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొండ ప్రాంతం కావడంతో అక్కడి రోడ్లు అన్నీ ఇరుకుగా ఉంటాయని, పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్డెక్కడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని అధికారులు తెలిపారు. కార్చిచ్చుకు గాలి తోడవడంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయని వివరించారు. బెవర్లీ హిల్స్‌, హాలీవుడ్‌ హిల్స్‌, మలిబు, శాన్‌ఫెర్నాండో ప్రాంతాలకు మంటలు విస్తరించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, కాలిఫోర్నియా కార్చిచ్చు విషయంలో అధికారులను అప్రమత్తం చేశానని, ఎప్పటికప్పుడు పరిస్థితిని ఆరా తీస్తున్నానని ప్రెసిడెంట్ జో బైడెన్ చెప్పారు. కార్చిచ్చు బాధితులకు వైట్ హౌస్ అవసరమైన సాయం అందిస్తుందని వివరించారు.


More Telugu News