అమెరికా తిప్పి పంపిన భారత వలసదారుల పరిస్థితి ఏమిటి.. ప్రభుత్వం ఏం చేయబోతోంది?

  • భారత అక్రమ వలసదారులను వెనక్కి పంపుతున్న అమెరికా
  • వారు మళ్లీ అమెరికా ముఖం చూసే అవకాశాలు దాదాపు గల్లంతు
  • బహిష్కరణకు గురైన వారికి వీసాలు ఇచ్చేందుకు పలు దేశాల నిరాకరణ
  • వెనక్కి వచ్చిన వారిపై భారత్‌లో చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం తక్కువే
  • నకిలీ ధ్రువీకరణ పత్రాలతో వెళ్లి ఉంటే తప్ప అందరూ సేఫ్
తమ దేశంలో ఉంటున్న అక్రమ వలసదారులను అమెరికా ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తిప్పి పంపుతోంది. ఇప్పటికే 104 మంది భారతీయులను అమెరికా మిలటరీ విమానం మోసుకొచ్చింది. మరింతమందిని వెనక్కి పంపే ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ చేరుకున్న వలసదారుల పరిస్థితి ఏమిటన్న చర్చ మొదలైంది. వీరికి భారత్‌లో పెద్దగా చిక్కులు ఎదురు కాకపోవచ్చు కానీ, తిరిగి అమెరికా ముఖం మాత్రం చూడలేరన్నది వాస్తవం. బహిష్కరణకు గురైన వారికి వీసాలు ఇచ్చేందుకు మెజారిటీ దేశాలు అంగీకరించవు.

ఇక, నకిలీ పత్రాలతో వారు అమెరికాకు వెళ్లి ఉంటే తప్ప వారిపై చట్టపరంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేదు. వారు నిజమైన భారత్ పాస్‌పోర్ట్, చెల్లుబాటు అయ్యే సొంత ధ్రువీకరణ పత్రాలు ఉంటే వారిపై ఎలాంటి చర్యలు ఉండబోవని సీనియర్ అడ్వకేట్, ఢిల్లీ బార్ కౌన్సిల్ చైర్మన్ కేకే మనన్ తెలిపారు. కొందరు వలసదారులు నకిలీ పాస్‌పోర్ట్, వేరేవారి పాస్‌పోర్ట్‌పై తమ ఫొటో అంటించుకోవడం, పేరు, పుట్టిన తేదీ మార్చుకోవడం వంటివి చేసి అక్రమ మార్గాల్లో (డంకీ రూట్) వెళ్లిన వారు మాత్రం చట్టపరమైన చర్యలు ఎదుర్కోక తప్పదని ఆయన పేర్కొన్నారు. 

చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం తక్కువే
వలస వెళ్లిన వారిలో చాలామంది పాక్షిక అక్షరాస్యులని, పేద కుటుంబాలకు చెందినవారని కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రభుత్వంలో అడ్వకేట్‌ జనరల్‌గా పనిచేసిన అతుల్ నందా తెలిపారు. వారు నకిలీ పత్రాలతో వెళ్లే అవకాశం తక్కువని చెప్పారు. బహిష్కరణకు గురైన వలసదారులు ఆతిథ్య దేశంలో ఏదైనా నేరాలకు పాల్పడినా, భారత్‌లో ఏదైనా పాస్‌పోర్ట్ మోసానికి పాల్పడితే తప్ప వారిపై ఎటువంటి విచారణ జరగదని అక్రమ వలసదారులకు సంబంధించిన సమస్యలపై పనిచేసిన న్యాయవాది కమలేశ్ మిశ్రా తెలిపారు. అయితే, వారు ఉపయోగించిన పత్రాలు సరైనవో, కావో తెలుసుకునేందుకు మాత్రం ప్రశ్నించవచ్చని పేర్కొన్నారు.  లక్షల రూపాయలు తీసుకుని వారిని అక్రమంగా విదేశాలకు పంపిన ఏజెంట్లపై మాత్రం చర్యలు తప్పవు.   

పదేళ్ల వరకు దేశం దాటలేరు
అక్రమ వలసదారులుగా బహిష్కరణకు గురైనవారు మళ్లీ వెళ్లే అవకాశం లేదని న్యాయవాదులు చెబుతున్నారు. ఇలాంటి వారికి మెజారిటీ దేశాలు వీసా ఇచ్చే అవకాశం లేదని అంటున్నారు. ముఖ్యంగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే, స్కెంజెన్ (యూరోపియన్) వంటి దేశాలు వీరికి వీసాలు ఇవ్వవు. యూఎస్ ఎంబసీ వెబ్‌సైట్ ప్రకారం.. బహిష్కరణకు గురైన వారు తిరిగి వీసాకు దరఖాస్తు చేసుకోకుండా పదేళ్ల వరకు నిషేధం విధించవచ్చు. అయితే ఈ విషయంలో కొన్నిసార్లు మినహాయింపు ఉంటుంది. యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్ ప్రకారం బహిష్కరణకు గురైన అక్రమ విదేశీయులు కనీసం ఐదేళ్లపాటు వీసా కోసం దరఖాస్తు చేసుకోలేరు. 


More Telugu News