అర్జున అవార్డు గ్ర‌హీత‌లైన స్టార్ క‌పుల్ మ‌ధ్య వివాదం.. పరస్పరం పోలీసులకు ఫిర్యాదు

  • వివాదంలో చిక్కుకున్న సావీటీ బురా, దీపక్ హుడా
  • వ‌ర‌క‌ట్న వేధింపుల‌ ఆరోపణల‌తో మ‌హిళా బాక్స‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు
  • ఆమె కుటుంబం త‌న‌ను ఆర్థికంగా మోసం చేసిందని ఆరోపించిన మాజీ కబడ్డీ ఆటగాడు 
  • దీపక్‌ హుడాకు 2020లో, సావీటీ బురాకు 2025లో అర్జున అవార్డులు
అంతర్జాతీయ మ‌హిళా బాక్సర్ సావీటీ బురా, ఆమె భ‌ర్త‌, భారత కబడ్డీ జట్టు మాజీ ఆటగాడు దీపక్ హుడా వివాదంలో చిక్కుకున్నారు. హుడాపై సావీటీ గృహ హింస, వ‌ర‌క‌ట్న వేధింపుల‌ ఆరోపణలు చేయగా, ఆమె కుటుంబం త‌న‌ను ఆర్థికంగా మోసం చేసిందని హుడా ఆరోపించాడు. ఈ నేప‌థ్యంలో ఈ స్టార్ క‌పుల్ ఒక‌రిపై ఒక‌రు హిసార్, రోహ్తక్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసుకున్నారు.

వ‌ర‌క‌ట్నం కోసం వేధించార‌ని సావీటీ హ‌ర్యానాలోని హిసార్ పీఎస్‌లో ఫిర్యాదు చేయ‌డంతో ఆయ‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. పుట్టింటి నుంచి ఎస్‌యూవీ, రూ. 1కోటి తేవాల‌ని త‌న‌పై దాడి చేశార‌ని ఆమె త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే బాక్సింగ్‌ ఆటను కూడా విడిచిపెట్టమని తనపై ఒత్తిడి తెచ్చారని, గతేడాది అక్టోబర్‌లో జరిగిన గొడవ తర్వాత తనను ఇంటి నుండి గెంటేశారని కూడా ఆమె ఆరోపించారు. సావీటీ ఫిర్యాదు మేరకు హిసార్ పోలీసులు హుడాపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

మ‌రోవైపు హిసార్‌కు చెందిన బాక్సర్ కుటుంబం తన ఆస్తిని ఆక్రమించుకుందని, పైగా తీవ్ర పరిణామాలు ఉంటాయని త‌న‌ను సావీటీ ఫ్యామిలీ బెదిరించిందని హుడా ఆరోపించాడు. ఈ మేర‌కు రోహ్తక్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. ప్ర‌స్తుతం ద‌ర్యాప్తు జ‌రుగుతోంది. 2022 జులై 7న వివాహం చేసుకున్న ఈ జంట ఇప్పుడు విడిపోవడానికి సిద్ధమవుతోంది. కాగా, దీపక్‌ హుడాను 2020లో, 2023 ప్రపంచ ఛాంపియన్‌షిప్ బంగారు పతక విజేత అయిన సావీటీ బురాను ఈ ఏడాది జ‌న‌వ‌రిలో కేంద్రం అర్జున అవార్డుల‌తో సత్క‌రించింది. 


More Telugu News