పాకిస్థాన్ క్రికెట్ బోర్డు న‌వ్వుల‌పాలు.. వీళ్లా వ‌ర‌ల్డ్‌క‌ప్ ను నిర్వ‌హించేదంటూ ఏకిపారేస్తున్న నెటిజ‌న్లు!

  • పాక్‌లో జ‌రుగుతున్న మ్యాచ్‌ల‌ను వెంటాడుతున్న వ‌రుణుడు 
  • నిన్న‌టి కీల‌క‌మైన‌ ఆసీస్‌, ఆఫ్ఘ‌న్ మ్యాచ్‌తో పాటు 3 గేమ్‌లు వ‌ర్షార్ప‌ణం
  • నిన్న కేవ‌లం అర‌గంట పాటే వ‌ర్షం కుర‌వ‌గా, మ్యాచ్ నిర్వ‌హ‌ణ సాధ్యంకాని వైనం
  • ఈ నేప‌థ్యంలో పీసీబీపై సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్ల విమ‌ర్శ‌లు
  • వ‌ర్షం ప‌డిన త‌ర్వాత నీటిని బ‌య‌టికి పంపిన తీరు, క‌వ‌ర్ల‌ను తీసిన విధానం న‌వ్వుల పాలు
ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌లో జ‌రుగుతున్న మ్యాచ్‌ల‌ను వ‌రుణుడు వెంటాడుతున్నాడు. రావ‌ల్పిండి వేదిక‌గా జ‌ర‌గాల్సిన‌ రెండు మ్యాచ్‌లు (ఆస్ట్రేలియా వ‌ర్సెస్ ద‌క్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ వ‌ర్సెస్ పాకిస్థాన్‌)తో పాటు, నిన్న లాహోర్‌లో జరగాల్సిన ఆసీస్‌, ఆఫ్ఘన్ కీల‌క‌ మ్యాచ్‌ కూడా వ‌ర్షార్ప‌ణం అయింది. ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్‌లోకి అడుగుపెట్టాల‌నుకున్న ఆఫ్ఘ‌నిస్థాన్ ఆశ‌ల‌పై వ‌రుణుడు నీళ్లు చ‌ల్లాడు.

ఈ మ్యాచ్‌లో మొద‌ట టాస్ గెలిచిన ఆఫ్ఘ‌న్ బ్యాటింగ్ చేసింది. 273 ప‌రుగులు చేసి, ఆసీస్ ముందు భారీ ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. అనంత‌రం ఆస్ట్రేలియా ఛేద‌న‌కు దిగిన స‌మయంలో వ‌ర్షం ఆటంకం క‌లిగించింది. 12.5 ఓవ‌ర్ల‌లో ఆసీస్‌ వికెట్ న‌ష్టానికి 109 ర‌న్స్ వ‌ద్ద ఉన్న‌ప్పుడు వ‌ర్షం కుర‌వ‌డం మొద‌లైంది. అర‌గంట పాటు దంచి కొట్టింది. దాంతో మైదానం చిత్తడిగా మారింది. గ్రౌండ్ స్టాఫ్ గంట‌కు పైగా క‌ష్ట‌పడ్డప్పటికీ ఫ‌లితం లేకుండా పోయింది. మైదానం సిద్ధం కాక‌పోవ‌డంతో అంపైర్లు మ్యాచ్‌ను ర‌ద్దు చేశారు.

అయితే, కేవ‌లం అర‌గంట పాటే వ‌ర్షం కుర‌వ‌గా, మ్యాచ్ నిర్వ‌హ‌ణ సాధ్యం కాక‌పోవ‌డంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు విమ‌ర్శ‌ల‌కు దిగారు. వ‌ర్షం ప‌డిన త‌ర్వాత నీటిని మైదానం సిబ్బంది బ‌య‌టికి పంపిన తీరు, క‌వ‌ర్ల‌ను తీసిన పధ్ధతి న‌వ్వుల పాలైంది. దాంతో వీళ్లా వ‌ర‌ల్డ్‌క‌ప్ నిర్వ‌హించేదంటూ ఏకిపారేస్తున్నారు. ఇంకెప్పుడూ పాకిస్థాన్‌కు ఐసీసీ ఈవెంట్లు నిర్వ‌హించే అవ‌కాశం ఇవ్వొద్ద‌ని మండిప‌డుతున్నారు.


More Telugu News