కుక్క‌ల నుంచి త‌ప్పించుకోబోయి బావిలో ప‌డ్డ వ్య‌క్తి.. 3 రోజులు అక్క‌డే న‌ర‌క‌యాత‌న‌!

  • మ‌హారాష్ట్రలోని ఛ‌త్ర‌ప‌తి శంభాజీ న‌గ‌ర్ జిల్లాలో ఘ‌ట‌న‌
  • బంధువుల గ్రామానికి వెళ్లిన యువ‌కుడిని త‌రిమిన వీధి కుక్క‌లు
  • వాటి నుంచి త‌ప్పించుకునే క్ర‌మంలో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలోని బావిలో ప‌డ్డ వైనం
  • 3రోజుల త‌ర్వాత గ్రామ‌స్థుల సాయంతో యువ‌కుడిని కాపాడిన పోలీసులు
వీధి కుక్క‌ల నుంచి త‌ప్పించుకోబోయి ఓ యువ‌కుడు నేల‌బావిలో ప‌డి, అక్క‌డే మూడు రోజులు న‌ర‌క‌యాత‌న అనుభ‌వించిన ఘ‌ట‌న‌ మ‌హారాష్ట్రలోని ఛ‌త్ర‌ప‌తి శంభాజీ న‌గ‌ర్ జిల్లాలో చోటుచేసుకుంది. లోతైన బావి నుంచి బ‌య‌ట‌ప‌డే మార్గం లేక మూడు రోజులపాటు అక్క‌డే ఉండిపోయాడు. చివ‌రికి గ్రామ‌స్థుల సాయంతో ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. 

వివ‌రాల్లోకి వెళితే... సందీప్ (32) అనే యువ‌కుడు పిశోర్‌లోని త‌న బంధువుల ఇంటికి వెళ్లాడు. అయితే, బంధువుల‌ గ్రామానికి చేరుకోగానే అత‌డిని కుక్క‌లు వెంబ‌డించాయి. వాటి నుంచి త‌ప్పించుకునే క్ర‌మంలో భ‌యంతో ప‌రుగు అందుకున్న సందీప్ నిర్మానుష్యంగా ఉన్న ఓ నేల‌బావిలో ప‌డిపోయాడు. లోతైన ఆ బావి నుంచి ఎంత అరిచినా అత‌డి కేక‌లు ఎవ‌రికీ వినిపించ‌లేదు. 

దాంతో మూడు రోజులు అక్క‌డే ఉండిపోయాడు. ఈ క్ర‌మంలో కొంత‌మంది పిల్ల‌లు ఆడుకుంటూ ఆ బావి ద‌గ్గ‌రికి వెళ్లారు. ఆ స‌మ‌యంలో సందీప్ వారి కంట‌బ‌డ్డాడు. దాంతో వెంట‌నే వెళ్లి గ్రామ‌స్థుల‌కు విష‌యం చెప్పారు. గ్రామ‌స్థుల స‌మాచారంతో బావివ‌ద్ద‌కు చేరుకున్న పోలీసులు పొడ‌వాటి తాడుకు ఓ టైరును క‌ట్టి బావిలోకి వ‌దిలారు. దాని సాయంతో సందీప్‌ను బ‌య‌ట‌కు తీశారు.    


More Telugu News