ఆ విషయంలో ట్రంప్ నుంచి మోదీ నేర్చుకోవాలి: అఖిలేశ్ యాదవ్

  • ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతులపై సుంకాలను విధించాలన్న అఖిలేశ్ యాదవ్
  • మన దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలన్న యూపీ మాజీ ముఖ్యమంత్రి
  • ఆర్థిక వ్యవస్థ గురించి తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని ఆరోపణ
సుంకాల విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి నేర్చుకోవాలని ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సూచించారు. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలంటే ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతులపై సుంకాలు విధించాలని అన్నారు.

లక్నోలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ, తన దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి ట్రంప్ అన్ని దేశాలపై సుంకాలు విధించారని, దీనిని చూసి మన ప్రభుత్వం నేర్చుకోవాలని అన్నారు. మనం కూడా చైనాపై ఆంక్షలు విధించాలా, వద్దా అని ప్రశ్నించారు.

ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటుందని అన్నారు. ఉచితంగా రేషన్ పొందుతున్న వారి తలసరి ఆదాయం ఎంత ఉందో తెలుసుకుంటే అర్థమవుతుందని అఖిలేశ్ యాదవ్ అన్నారు. మన ఆర్థిక వ్యవస్థ గురించి తప్పుడు లెక్కలు చూపుతున్నారని ఆయన విమర్శించారు.

గోరఖ్‌పూర్, అయోధ్యలోని వక్ఫ్ ఆస్తులను కాజేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయని విమర్శించారు. నేరస్థులపై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మౌనం వహిస్తోందని అఖిలేశ్ యాదవ్ ధ్వజమెత్తారు.


More Telugu News