'క‌న్న‌ప్ప' విడుద‌ల తేదీని ప్ర‌క‌టించిన మేక‌ర్స్

  • మంచు విష్ణు, ముకేశ్ కుమార్ సింగ్ కాంబోలో 'క‌న్న‌ప్ప' 
  • జూన్ 27న విడుదల చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌ట‌న‌
  • మూవీ రిలీజ్ డేట్ పోస్టర్ ను ఆవిష్క‌రించిన యూపీ సీఎం
మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన 'క‌న్న‌ప్ప' సినిమా కొత్త విడుద‌ల తేదీని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో వివిధ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న విడుదల చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ పోస్టర్ ను ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ చేతుల మీదుగా ఆవిష్కరింపచేశారు. 

ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యనాథ్‌ని సీనియ‌ర్ న‌టుడు మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, ఈ చిత్రానికి కొరియోగ్రఫీ అందించిన ప్రభుదేవా మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న 'క‌న్న‌ప్ప' కొత్త విడుద‌ల తేదీ పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించారు. రిలీజ్ డేట్ పోస్టర్ ఆవిష్కరించిన అనంతరం సీఎం యోగి మూవీ యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 

కాగా, ఏప్రిల్ 25న విడుదల కావాల్సిన ఈ సినిమాను వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి కాని కారణంగా వాయిదా వేశారు. తాజాగా ఈ చిత్రం కొత్త విడుద‌ల తేదీని ప్రకటించారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాట‌ల‌కు మంచి స్పందన వ‌చ్చిన విష‌యం తెలిసిందే. 

'క‌న్న‌ప్ప‌'లో విష్ణు సరసన ప్రీతి ముకుందన్ నాయికగా నటిస్తోంది. మంచు మోహన్ బాబుతో పాటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్, శరత్ కుమార్, బ్రహ్మానందం తదితరులు ఇత‌ర‌ కీలక పాత్రల్లో క‌నిపించ‌నున్నారు.


More Telugu News