మరో హిస్టారికల్... వచ్చే నెలలో అంతరిక్షంలోకి భారత వ్యోమగామి

  • మే నెలలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా
  • యాక్సియమ్ స్పేస్ వాణిజ్య యాత్ర (Ax-4)లో పైలట్‌గా బాధ్యతలు
  • అమెరికాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 ద్వారా ప్రయోగం.
  • రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్తున్న తొలి భారతీయుడిగా గుర్తింపు
భారత అంతరిక్ష యాత్రలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. భారత వాయుసేన గ్రూప్ కెప్టెన్, వ్యోమగామిగా ఎంపికైన శుభాన్షు శుక్లా వచ్చే నెలలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) ప్రయాణం కానున్నారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ యాత్ర భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న గగన్‌యాన్ మిషన్‌కు అత్యంత కీలకమైన ముందడుగు కానుంది.

ఈ విషయాన్ని కేంద్ర అంతరిక్ష, సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. "భారత వ్యోమగామితో కూడిన అంతర్జాతీయ అంతరిక్ష యాత్ర వచ్చే నెలలో జరగనుంది. దీని ద్వారా భారతదేశం తన అంతరిక్ష ప్రస్థానంలో ఒక నిర్ణయాత్మక అధ్యాయాన్ని లిఖించబోతోంది. గగన్‌యాన్ సన్నాహాలు, ఐఎస్‌ఎస్ యాత్ర, రాబోయే ప్రయోగాలతో భారత అంతరిక్ష కలలు మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నాయి" అని పేర్కొన్నారు.

గత ఎనిమిది నెలలుగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా (NASA), ప్రైవేట్ అంతరిక్ష సంస్థ యాక్సియమ్ స్పేస్ (Axiom Space) వద్ద గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా కఠిన శిక్షణ పొందుతున్నారు. యాక్సియమ్ స్పేస్ నిర్వహిస్తున్న Ax-4 అనే వాణిజ్య యాత్రలో భాగంగా ఆయన ఐఎస్‌ఎస్‌కు వెళ్లనున్నారు. 

ఈ ప్రైవేట్ మిషన్ కోసం భారత్ సుమారు 60 మిలియన్ డాలర్లకు పైగా చెల్లించినట్లు సమాచారం. అమెరికాలోని ఫ్లోరిడాలో గల కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్‌ఎక్స్ (SpaceX) సంస్థకు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరగనుంది. నలుగురు సభ్యుల వ్యోమగామి బృందం స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్‌లో ప్రయాణిస్తుంది.

ఈ యాత్రకు యాక్సియమ్ స్పేస్‌కు చెందిన, నాసా మాజీ వ్యోమగామి పెగ్గీ విట్సన్ కమాండర్‌గా వ్యవహరిస్తారు. మిగిలిన ఇద్దరు సభ్యులు పోలండ్‌కు చెందిన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వ్యోమగామి స్లావోస్జ్ ఉజ్నాన్స్కి, హంగేరీకి చెందిన టిబోర్ కపు మిషన్ స్పెషలిస్టులుగా ఉంటారు. 40 ఏళ్ల గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా ఈ మిషన్‌లో పైలట్ పాత్రను పోషించనున్నారు. ఆయనకు సుదీర్ఘ కెరీర్ ఉన్నందున, ఇస్రో తమ వ్యోమగాములలో పిన్న వయస్కుడైన శుక్లాను ఈ యాత్రకు ఎంపిక చేసింది.

గగన్‌యాన్‌కు కీలక అనుభవం

1984లో సోవియట్ సోయుజ్ వ్యోమనౌకలో రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత, సుమారు నాలుగు దశాబ్దాల అనంతరం అంతరిక్షంలోకి, ముఖ్యంగా ఐఎస్‌ఎస్‌కు వెళ్తున్న తొలి భారతీయుడిగా శుభాన్షు శుక్లా నిలవనున్నారు. ఈ యాత్ర కేవలం చరిత్రాత్మకమే కాకుండా, వ్యూహాత్మకంగా కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. భారత తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ కోసం అవసరమైన కీలక అనుభవాన్ని ఈ యాత్ర అందిస్తుందని ఇస్రో భావిస్తోంది.




More Telugu News