తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న సమంత

  • గతేడాది ప్రొడక్షన్ హౌస్ స్థాపించిన సమంత
  • సమంత సొంత బ్యానర్ పై తెరకెక్కిన శుభం చిత్రం
  • శుభం చిత్ర యూనిట్ తో కలిసి తిరుమల వచ్చిన సామ్
  • వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి దర్శనం
ప్రముఖ సినీ నటి సమంత నేడు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తన నిర్మాణంలో త్వరలో విడుదల కానున్న 'శుభం' చిత్ర బృందంతో కలిసి ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు.

శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో సమంత, 'శుభం' యూనిట్ సభ్యులు ఆలయానికి చేరుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వీరికి స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. సమంత, చిత్ర యూనిట్ సభ్యులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు సమంతకు, చిత్ర బృందానికి వేదాశీర్వచనం అందించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శనానికి ముందు, సమంత వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో డిక్లరేషన్ సమర్పించారు.

కాగా, సమంత గత ఏడాది 'ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌' పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ బ్యానర్‌పైనే ఆమె 'శుభం' చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందంతో కలిసి ఆమె తిరుమల రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.


More Telugu News