గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. గుజ‌రాత్ ఖాతాలో ఆరో విజ‌యం.. సొంత‌మైదానంలో కేకేఆర్ ఓట‌మి!

  • ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్‌, జీటీ మ్యాచ్
  • 39 ప‌రుగుల తేడాతో గుజ‌రాత్ ఘ‌న విజ‌యం
  • 90 పరుగులతో రాణించిన కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్‌
  • ఆడిన 8 మ్యాచుల్లో 6 విజ‌యాలతో పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్‌లోకి జీటీ
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్‌)తో జ‌రిగిన మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ (జీటీ) ఘ‌న విజ‌యం సాధించింది. 199 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలో దిగిన కేకేఆర్ నిర్ణీత ఓవ‌ర్లలో 8 వికెట్ల‌కు 159 ప‌రుగులకే ప‌రిమిత‌మైంది. దీంతో గుజ‌రాత్‌ 39 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.  

కెప్టెన్ ర‌హానే అర్ధ శ‌త‌కం (50)తో రాణించ‌గా... ర‌ఘువంశీ 27, ఆండ్రీ ర‌స్సెల్ 21 ర‌న్స్ చేసి ఫ‌ర్వాలేద‌నిపించారు. మిగ‌తా బ్యాట‌ర్లు విఫ‌ల‌మ‌య్యారు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో ర‌షీద్ ఖాన్‌, ప్ర‌సిద్ధ్ కృష్ణ చెరో 2 వికెట్లు తీయ‌గా... మ‌హ్మ‌ద్ సిరాజ్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్, సాయి కిశోర్‌, ఇషాంత్ శ‌ర్మ త‌లో వికెట్ ప‌డగొట్టారు.

అంత‌కుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 198 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్ మన్ గిల్ 55 బంతుల్లో 90 పరుగులు చేసి, త్రుటిలో శ‌త‌కం చేజార్చుకున్నాడు. మరో ఓపెనర్ సాయి సుదర్శన్ తన అద్భుత‌మైన‌ ఫామ్ ను కొసాగిస్తూ మరో అర్ధసెంచరీ (52) నమోదు చేశాడు. 

జాస్ బట్లర్ మ‌రోసారి బ్యాట్ ఝుళిపించాడు. కేవ‌లం 23 బంతుల్లోనే అజేయంగా 41 పరుగులు చేశాడు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, ఆండ్రీ రస్సెల్ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు. ఈ విజ‌యంతో టైటాన్స్ పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్‌కు దూసుకెళ్లింది. ఆడిన 8 మ్యాచుల్లో 6 విజ‌యాలు న‌మోదు చేయ‌డం విశేషం. మ‌రోవైపు కేకేఆర్ 8 మ్యాచులు ఆడి, కేవలం 3 విజ‌యాల‌తో ఏడో స్థానంలో కొన‌సాగుతోంది. 


More Telugu News