ప్రస్తుతం ఇన్ని అన్యాయాలు జరుగుతున్నా దేవుడు ఎందుకు రావడం లేదు?.. సివిల్స్ టాపర్ సమాధానం ఇదే!

  • సివిల్స్‌లో ఇట్టబోయిన సాయిశివానికి 11వ ర్యాంకు
  • తెలుగు రాష్ట్రాల్లో టాపర్‌గా వరంగల్ యువతి
  • ఇంటర్వ్యూలో "దేవుడెందుకు రావట్లేదు?" అని ప్రశ్న
  • భగవద్గీత 'సంభవామి యుగేయుగే' సూక్తి ప్రస్తావన
  • ఆపదలో ఆదుకునేవారే దేవుళ్లని శివాని సమాధానం
సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో 11వ ర్యాంకు సాధించి, తెలుగు రాష్ట్రాలకే గర్వకారణంగా నిలిచిన వరంగల్ యువతి ఇట్టబోయిన సాయి శివానికి ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. "భగవద్గీతలో 'సంభవామి యుగేయుగే' అని శ్రీకృష్ణుడు చెప్పారు కదా, మరి ప్రస్తుతం సమాజంలో ఇన్ని అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నా దేవుడు ఎందుకు రావడం లేదు?" అని  ఇంటర్వ్యూ బోర్డు సభ్యులు ఆమెను ప్రశ్నించారు.

ఈ క్లిష్టమైన ప్రశ్నకు సాయి శివాని ఎంతో పరిణతితో, ఆలోచనాత్మకంగా బదులిచ్చారు. "సమాజంలో ఉన్న ప్రతి మనిషిలోనూ ఎంతో కొంత మంచితనం ఉంటుంది. అవసరమైన వారికి సరైన సమయంలో సహాయం చేస్తే, ఆ సహాయం చేసేవారే దేవుడితో సమానం. దేవుడు ప్రత్యేకంగా ఎక్కడి నుంచో రానక్కర్లేదు. సహాయం చేసే ప్రతి ఒక్కరూ దేవుడితో సమానమే" అని ఆమె సమయస్ఫూర్తితో వివరించారు. 

వరంగల్ లోని ఖిలా వరంగల్‌కు చెందిన ఈమె, మధ్యతరగతి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి రెండో ప్రయత్నంలో ఈ అద్భుత విజయాన్ని అందుకున్నారు. తన మూడేళ్ల కఠోర శ్రమ, కుటుంబ సభ్యులు, స్నేహితుల ప్రోత్సాహమే ఈ విజయానికి కారణమని సాయిశివాని తెలిపారు. ఇంటర్వ్యూలో ఒత్తిడిని జయించడం కూడా ర్యాంకు సాధించడంలో కీలకమని ఆమె పేర్కొన్నారు.


More Telugu News