వేసవి సెలవులకు ఇంటికి వస్తే.. బలవంతంగా పెళ్లి చేసేశారు

  • తిరుప‌తి జిల్లా కోటలో దారుణ ఘ‌ట‌న
  • వేస‌వి సెల‌వుల కోసం ఇంటికి వ‌చ్చిన ఏడో త‌ర‌గ‌తి చ‌దువుతున్న బాలిక  
  • కూతురికి బ‌ల‌వంతంగా పెళ్లి చేసేసిన పేరెంట్స్ 
  • తాను చ‌దువుతున్న పాఠ‌శాల‌కు వెళ్లి.. టీచ‌ర్ల వ‌ద్ద బోరున ఏడ్చిన విద్యార్థిని
  • దాంతో వారు ఐసీడీఎస్ అధికారుల‌కు స‌మాచారం ఇవ్వడంతో వెలుగులోకి విష‌యం
ఏపీలోని తిరుప‌తి జిల్లా కోటలో దారుణ ఘ‌ట‌న వెలుగుచూసింది. వేస‌వి సెల‌వుల కోసం ఇంటికి వ‌చ్చిన ఏడో త‌ర‌గ‌తి చదువుతున్న‌ కూతురికి పేరెంట్స్ బ‌ల‌వంతంగా పెళ్లి చేసేశారు. భ‌ర్త‌తో కాపురం చేయాల్సిందేన‌ని, త‌న‌ను క‌న్న‌వాళ్లు వేధిస్తున్నార‌ని ఆ బాలిక టీచ‌ర్ల వ‌ద్ద బోరున ఏడ్చింది. దాంతో వారు పోలీసుల‌తో పాటు ఐసీడీఎస్ అధికారుల‌కు స‌మాచారం ఇవ్వడంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. 

పూర్తి వివ‌రాల్లోకి వెళితే... కోట మండ‌లం గూడ‌లి స‌మీపంలోని కాల‌నీలో నివాసం ఉంటున్న ఎస్టీ సామాజిక వ‌ర్గానికి చెందిన అక్కాచెల్లెళ్లు... కోట గిరిజ‌న గురుకుల పాఠ‌శాల‌లో 7, 9 త‌ర‌గ‌తులు చ‌దువుతున్నారు. వేస‌వి సెల‌వులు కావ‌డంతో ఈ నెల 23న ఇంటికి వెళ్లారు. అంతే... ఆ రాత్రే ఇద్ద‌రికీ త‌ల్లిదండ్రులు పెళ్లి కుదిర్చేశారు. ఆ మ‌రుస‌టి రోజే పెళ్లిళ్లు చేసేసి భ‌ర్త‌ల వెంట పంపేశారు. 

30 ఏళ్ల వ్య‌క్తికి ఏడో త‌ర‌గ‌తి చ‌దువుతున్న బాలిక‌ను ఇచ్చి పెళ్లి చేశారు. దాంతో ఆ బాలిక కాపురం చేయ‌లేనంటూ పుట్టింటికి వ‌చ్చేసింది. పేరెంట్స్ ఎంత చెప్పిన విన‌కుండా... తాళితోనే తాను చ‌దువుతున్న గురుకుల పాఠ‌శాల‌కు వెళ్లిపోయింది. త‌న‌ను కాపాడ‌మంటూ టీచ‌ర్ల‌ను వేడుకుంది. దాంతో వారు పోలీసులు, ఐసీడీఎస్ అధికారుల‌కు స‌మాచారం ఇచ్చారు. టీచ‌ర్ల స‌మాచారంతో ఐసీడీఎస్ సీడీపీఓ మునికుమారి, సూప‌ర్‌వైజ‌ర్ క‌విత పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అనంత‌రం బాలిక‌ను నెల్లూరులోని బోర్డింగ్ స్కూల్ (బాల‌స‌ద‌న్)కు త‌ర‌లించారు.  




More Telugu News