ఇదీ ఓ గెలుపేనా?: చంద్రబాబుపై జగన్ ఫైర్

  • టీడీపీ ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ తీవ్రస్థాయిలో ధ్వజం
  • రాష్ట్రంలో 'రాక్షస పాలన' సాగుతోందని వ్యాఖ్య
  • స్థానిక ఎన్నికల్లో బెదిరింపులు, ప్రలోభాలకు పాల్పడ్డారని ఆరోపణ
  • కుప్పం, పిఠాపురం, మార్కాపురం, గాండ్లపెంట ఘటనల ప్రస్తావన
  • కార్యకర్తలకు 'జగన్ 2.0'లో పెద్దపీట వేస్తానని భరోసా
రాష్ట్రంలో ప్రస్తుతం సాగుతున్నది రాక్షస పాలన అని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పిఠాపురం, మార్కాపురం, కదిరి (గాండ్లపెంట), కుప్పం (రామకుప్పం) నియోజకవర్గాల నేతలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై ఆయన చర్చించారు.

స్థానిక ఎన్నికల్లో అక్రమాలే తార్కాణం

ఇటీవల జరిగిన కొన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ వ్యవహరించిన తీరు అప్రజాస్వామికంగా ఉందని జగన్ ఆరోపించారు. మెజారిటీ స్థానాలు వైఎస్సార్సీపీ గెలుచుకున్నా, అధికార దుర్వినియోగం, బెదిరింపులు, డబ్బు ప్రలోభాలతో టీడీపీ పదవులను కైవసం చేసుకుందని విమర్శించారు. "సత్యసాయి జిల్లా గాండ్లపెంటలో ఏడు ఎంపీటీసీలకు ఆరు వైసీపీ గెలిస్తే, బెదిరించి ఎంపీపీ పదవి లాక్కున్నారు. మార్కాపురంలో 15కు 15 మనమే గెలిచినా, సూట్‌కేసు రాజకీయాలతో ప్రలోభపెట్టారు. పిఠాపురం మున్సిపాలిటీలో 30 మందికి 26 మంది మన కౌన్సిలర్లే అయినా, వారిని భయభ్రాంతులకు గురిచేశారు" అని జగన్ ఉదహరించారు.

ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కుప్పంలోనూ ఇదే దుస్థితి నెలకొందని ఆయన అన్నారు. "కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డులకు 19 వైసీపీ గెలిస్తే, మా కౌన్సిలర్లను బెదిరించి, రూ. 50 లక్షలిచ్చి లాక్కుని ఛైర్మన్ పదవిని దక్కించుకున్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వారే ఇలా చేస్తే ఎలా? బెదిరింపులు, ప్రలోభాలతో గెలిచారు... ఇది గెలుపా?" అని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థను సైతం టీడీపీ తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని, ఇంతటి ప్రతికూలతలోనూ నిలిచిన కార్యకర్తల ధైర్యాన్ని అభినందిస్తున్నానని తెలిపారు.

గతంలో కొన్ని కారణాల వల్ల కార్యకర్తలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయామని అంగీకరించిన జగన్, రాబోయే 'జగన్ 2.0'లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తామని భరోసా ఇచ్చారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఈ దుర్మార్గపు పాలనకు త్వరలోనే చరమగీతం పాడతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.


More Telugu News