ఢిల్లీ క్యాపిట‌ల్స్ బ్యాట‌ర్ 'పెద్ది' షాట్‌.. వీడియో అదిరిపోయిందంతే..!

  • ఈరోజు ఉప్ప‌ల్ వేదిక‌గా డీసీ, ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌
  • ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర వీడియోను పంచుకున్న ఢిల్లీ
  • 'పెద్ది' సినిమా గ్లింప్స్ ఆడియోతో వీడియోను ఎడిట్ చేసి వ‌దిలిన డీసీ
  • చ‌ర‌ణ్ కొట్టిన షాట్‌ను రీక్రియేట్ చేసిన‌ ఢిల్లీ ప్లేయ‌ర్‌ స‌మీర్ రిజ్వీ
ఈరోజు ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (ఎస్ఆర్‌హెచ్), ఢిల్లీ క్యాపిట‌ల్స్ (డీసీ) తల‌ప‌డ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్ నేప‌థ్యంలో డీసీ టీమ్ విడుద‌ల చేసిన ఓ వీడియో ఆక‌ట్టుకుంటోంది. గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న 'పెద్ది' సినిమా గ్లింప్స్ ఆడియోతో ఈ వీడియోను ఎడిట్ చేశారు. 

ఇందులో రామ్‌చ‌ర‌ణ్ కొట్టిన షాట్‌ను ఢిల్లీ ఆట‌గాడు స‌మీర్ రిజ్వీ రీక్రియేట్ చేశాడు. దీన్ని ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌న అధికారిక 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) ఖాతాలో పోస్ట్ చేయ‌గా... పెద్ది టీమ్ రీట్వీట్ చేసింది. ఇప్పుడీ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. దీనిపై మెగా అభిమానులు, క్రికెట్ ఫ్యాన్స్, నెటిజ‌న్లు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు. 

ఇక, ఈ రోజు జ‌రిగే మ్యాచ్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు చాలా కీల‌కం. ప్లేఆఫ్స్ ఆశ‌లు స‌జీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో త‌ప్ప‌నిస‌రిగా గెల‌వాల్సిందే. ఓడితే మాత్రం ప్లేఆఫ్స్ రేసు నుంచి ఎస్ఆర్‌హెచ్ నిష్క్ర‌మిస్తుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 10 మ్యాచుల్లో మూడింట మాత్ర‌మే గెలిచింది. మిగిలిన నాలుగు మ్యాచుల్లో భారీ మార్జిన్ల‌తో గెలిస్తే నాకౌట్‌పై ఆశ‌లు ఉంటాయి. 

ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో హైద‌రాబాద్ తొమ్మిదో స్థానంలో ఉంది. మ‌రోవైపు ఢిల్లీ 10 మ్యాచులాడి ఆరు విజ‌యాల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో ఐదో స్థానంలో కొన‌సాగుతోంది. ఇవాళ్టి మ్యాచ్‌లో గెలిచి టాప్‌లో 4 దూసుకెళ్లాల‌ని చూస్తోంది.  


More Telugu News